– 2030కి బంగారం విలువ ఎక్కడికి చేరుతుందంటే?
హైదరాబాద్, 23 నవంబర్ మనప్రజాప్రతినిధి:
బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా ఎడతెగకుండా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, జియోపాలిటికల్ టెన్షన్లు పెరగడంతో పెట్టుబడిదారులు మళ్లీ సేఫ్ అసెట్‌గా బంగారం వైపు పరుగులు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే… ఈరోజు రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030 నాటికి దాని విలువ ఎంత అవుతుంది?
ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,25,990 వద్ద కొనసాగుతోంది. గత 25 ఏళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే బంగారం సగటుగా ప్రతి ఏడాది 12 నుంచి 14 శాతం వరకు వృద్ధి చూపించింది. కొన్ని సంవత్సరాల్లో ఈ వృద్ధి మరింత ఎక్కువగానే నమోదైంది. 2000లో 10 గ్రాముల బంగారం ధర రూ.4,400 మాత్రమే ఉండగా, 2025 నాటికి అది రూ.1.25 లక్షలకు చేరుకోవడం ఈ పెరుగుదలకు స్పష్టమైన ఉదాహరణ.
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఐదేళ్లలో కూడా ఇదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా బంగారం ధరలు పెరిగే అవకాశముంది. ఈsame ట్రెండ్ కొనసాగితే 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర కనీసం రూ. 2.50 లక్షలకు చేరే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. మరికొన్ని అంతర్జాతీయ నివేదికలు మాత్రం ధరలు ఇంకా ఎక్కువగా పెరిగి 10 గ్రాములు రూ. 7 లక్షలకు కూడా చేరవచ్చని అంచనా వేస్తున్నాయి.
అలా కనీస అంచనాను తీసుకున్నా ఈరోజు రూ.5 లక్షల బంగారాన్ని కొనుగోలు చేస్తే, 2030 నాటికి దాని విలువ దాదాపు రూ.10 లక్షలకు చేరే అవకాశముంది. అంటే సరాసరి రెట్టింపు రాబడి రావచ్చన్నమాట. గరిష్ఠ అంచనాలను పరిగణలోకి తీసుకుంటే అది రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము.
అయితే బంగారం ధరలు పూర్తిగా మార్కెట్ పై ఆధారపడి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు, డాలర్ బలం, అంతర్జాతీయ పరిణామాలు అన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారంలో పెట్టుబడి పెట్టే ముందు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను, దీర్ఘకాల లక్ష్యాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది మార్కెట్ అంచనాలపై ఆధారపడ్డ సమాచారం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాల కోసం ఆర్థిక నిపుణులను సంప్రదించుకోవడం మంచిది.
5 లక్షల పెట్టుబడి..
RELATED ARTICLES

