•రాజరాజేశ్వరి దేవి ఆలయ భూమిపై అక్రమ ఆక్రమణ ఆరోపణలు
•పవిత్ర దేవాలయ భూమికే రక్షణ కరువు
తిరుపతిజిల్లా,జనవరి20:(మనప్రజాప్రతినిధి)
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుమల నగర్ పంచాయతీ పరిధిలోని కోళ్ల ఫారం గ్రామంలో ముప్పై సంవత్సరాలుగా వెలసి ఉన్న రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. సర్వే సంఖ్య 229 లోని దేవాలయ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దేవాలయ భూమి కబ్జా విషయమై గ్రామస్తులు గ్రామ రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేయగా, సంఘటన స్థలానికి చేరుకున్న అధికారి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అయినప్పటికీ కబ్జాదారుల బెదిరింపులు కొనసాగుతున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇటీవల దేవాలయాలపై దాడులు, పవిత్ర భూములపై అక్రమ కబ్జాలు పెరుగుతున్న తరుణంలో సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రాజరాజేశ్వరి దేవి ఆలయ భూమిని రక్షించి, అమ్మవారి ఆలయ గౌరవాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

