📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసదాశివపేటలో"బీజేపీ జెండా ఎగరాలి – ఎంపీ రఘునందన్ రావు

సదాశివపేటలో”బీజేపీ జెండా ఎగరాలి – ఎంపీ రఘునందన్ రావు

📰 Generate e-Paper Clip

•“2006లో ఎలా ఉందో…2026లో కూడా అదే పరిస్థితి” కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు.
సదాశివపేట,ఫిబ్రవరి6(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 21 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బలంగా నిలబడ్డారని, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే పార్టీ బీజేపీనేనని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం విశ్వగురువుగా ఎదుగుతోందని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీకేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు తీసుకొస్తామని, సదాశివపేట అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా నిధులు రానున్నాయని తెలిపారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చాయని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటూ మాటలకే పరిమితమయ్యారని, 830 సర్వే నంబర్‌లో ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తీవ్రవాదులు, దొంగలకు ఆశ్రయం కల్పించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.2006లో సదాశివపేట ఎలా ఉందో 2026లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని, పట్టణ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. కోమటి చెరువు పేరుతో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు.
బీజేపీ నాయకుడు ఓదెల మాణిక్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేశారని, బీజేపీ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. జయశ్రీ ముత్తన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు.మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరాలంటే ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు ఓదెల రాజేశ్వరి, బీజేపీ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular