Thursday, June 25, 2026
ads
Homeతెలంగాణతుంగభద్ర జలాల కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలి,సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర జలాల కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలి,సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

– తెలంగాణ వాటా నీటి వినియోగంపై ఉన్నతస్థాయి సమీక్ష
– ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయం
– జోగులాంబ గద్వాల జిల్లాకు నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్, జూన్ 24 (మనప్రజాప్రతినిధి): తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర ప్రాజెక్టు, రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్), అంతర్రాష్ట్ర జల వివాదాలపై జలసౌధలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం అయిదు నుంచి ఆరు టీఎంసీలకు మించి అందడం లేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో సుమారు 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచి నీటి వినియోగం సమర్థవంతంగా జరిగేలా కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్డీఎస్ ఆనకట్ట భద్రతపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆనకట్ట ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, భద్రతా పరమైన పనులను అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు వివరించారు. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ వైపు భారీగా పూడిక పేరుకుపోవడం వల్ల నీటి మళ్లింపు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఇంజనీర్లు తెలిపారు. 2004లో నిపుణుల కమిటీ చేసిన పూడికతీత, ఇతర సాంకేతిక సిఫారసులు ఇప్పటికీ అమలుకాలేదని సమావేశంలో చర్చించారు. పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని, ఇందుకు కర్ణాటక సహకారం కూడా కోరాలని నిర్ణయించారు.తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకునే మార్గాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular