రూ.40 లక్షల విలువైన నకిలీ నోట్లు ముద్రణ
భోపాల్‌లో గోకుల్ధామ్ సొసైటీలో ఆధునిక ప్రింటింగ్ యంత్రాల స్వాధీనం
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన మాజీ వైద్యుడే రాకెట్ సూత్రధారి
భోపాల్, 25నవంబర్ (మనప్రజాప్రతినిధి):
దేశాన్ని కలవరపరిచిన నకిలీ కరెన్సీ రాకెట్ మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ రాకెట్ వెనుక మాజీ ప్రభుత్వ వైద్యుడు ఉన్న విషయం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. రూ.500 నకిలీ నోట్లను భారీగా ముద్రించి, వివిధ రాష్ట్రాల్లో చెలామణి చేస్తున్న ఈ ముఠాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. పెథియా గ్రామానికి చెందిన మౌలానా జుబేర్ అన్సారీ మహారాష్ట్రలో నకిలీ నోట్ల మార్పిడి చేస్తూ అరెస్టయ్యాడు. అన్సారీ ఇంటిపై నవంబర్ 2న దాడి చేసిన పోలీసులు రూ.19.78 లక్షల విలువైన నకిలీ నోట్లు, నోట్ కట్టింగ్ మెషిన్‌తో సహా పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తును విస్తరించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో అసలు సూత్రధారి డాక్టర్ ప్రతీక్ నవలఖే అని బయటపడటంతో అధికారులు షాక్ అయ్యారు. రహస్య సమాచారంతో నవంబర్ 23న భోపాల్‌లోని గోకుల్ధామ్ సొసైటీ ఫ్లాట్‌పై దాడి చేసిన పోలీసులు, చిన్న గదిలోనే ఆధునిక ప్రింటర్లు, కట్టర్లు, డ్రైయింగ్ మెషీన్లు, కంప్యూటర్లు వంటి నకిలీ నోట్ల తయారీలో ఉపయోగించే సామగ్రి కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. డాక్టర్ ప్రతీక్‌తో పాటు గోపాల్ అలియాస్ రాహుల్, హర్దా దినేష్ గోర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ప్రతీక్ గతంలో బుర్హాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశాడు. అప్పటికే కోట్ల రూపాయల అక్రమాల కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన ఆయన, అక్కడే ఈ ముఠా సభ్యులతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత వైద్య వృత్తిని వదిలి నకిలీ కరెన్సీ తయారీ వ్యాపారానికి పూర్తిగా మారిపోయాడు. గోకుల్ధామ్ సొసైటీ ఫ్లాట్‌ను రాకెట్ కేంద్రంగా మార్చి, పలు నగరాల్లో ఏజెంట్లను నియమించి నకిలీ నోట్లను విస్తృతంగా చలామణి చేస్తున్నట్లు విచారణలో తేలింది. భోపాల్ హోషంగాబాద్ రోడ్డులో ఒక నకిలీ ట్రావెల్ ఏజెన్సీని కూడా కార్యాలయంగా ఈ ముఠా వినియోగించింది. నాగ్‌పూర్, మాలెగావ్, జల్గావ్ వంటి ప్రాంతాలకు నకిలీ నోట్ల రవాణా ట్రాక్‌లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ ముఠా రూ.40 లక్షల విలువైన నకిలీ కరెన్సీని చలామణి చేసినట్లు అధికారులు తెలిపారు. నకిలీ నోట్లతో ఒక ఆస్తిని కూడా కొనుగోలు చేసినట్టు వివరించారు. ఈ భారీ కుంభకోణంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు
RELATED ARTICLES

