Friday, February 27, 2026
ads
Homeఇంటర్నేషనల్తేజస్‌ ప్రమాదంపై హెచ్ఏఎల్‌ కీలక వ్యాఖ్యలు

తేజస్‌ ప్రమాదంపై హెచ్ఏఎల్‌ కీలక వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip

తేజస్‌ ప్రమాదంపై హెచ్ఏఎల్‌ విచారం
షేర్‌ మార్కెట్‌లో కంపెనీ వాటాల పతనం
విచారణకు పూర్తి సహకారం హామీ

బెంగళూరు, 24 నవంబర్‌ (మనప్రజాప్రతినిధి):
దుబాయ్‌ విమాన ప్రదర్శనలో కూలిపోయిన తేజస్‌ యుద్ధ విమానం ప్రమాదం దేశాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో వాయుసేన అధికారిగా పనిచేసిన వింగ్‌ కమాండర్‌ నమాన్ష్‌ సయాల్‌ ప్రాణాలు కోల్పోవడం పట్ల హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తీవ్ర బాధ వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం అసాధారణ పరిస్థితుల్లో జరిగినదని సంస్థ ప్రకటించింది. పైలట్‌ కుటుంబానికి సంతాపం తెలిపింది. ప్రమాద ప్రభావం మార్కెట్‌లో కూడా కనిపించింది. ఉదయం ప్రారంభమైన లావాదేవీలలోనే హెచ్ఏఎల్‌ వాటాలు భారీగా పడిపోయాయి. ఒక దశలో ఎనిమిది శాతం మేర తగ్గి రూ.4,205 వద్దకు చేరినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదం తమ సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక స్థితి, భవిష్యత్తు ఉత్పత్తులపై ఎలాంటి ప్రభావం చూపదని హెచ్ఏఎల్‌ స్పష్టం చేసింది. విచారణ చేపడుతున్న సంస్థలకు తమ పూర్తి సహకారం అందిస్తామని హెచ్ఏఎల్‌ హామీ ఇచ్చింది. వాటాదారులకు సంబంధించిన సమాచారాన్ని సమయానుసారం అందజేస్తామని తెలిపింది. కూలిపోయిన తేజస్‌ విమానం తమిళనాడులోని సూలూరు విభాగానికి చెందినదిగా తెలిసింది. తేజస్‌ విమానం కొద్ది నిమిషాల పాటు విన్యాసాలు చేసిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు భారత వాయుసేన సమగ్ర విచారణను ప్రారంభించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular