Friday, February 27, 2026
ads
Homeఇంటర్నేషనల్అంధ మహిళా క్రికెట్‌లో భారత జట్టు స్వర్ణ చరిత్ర

అంధ మహిళా క్రికెట్‌లో భారత జట్టు స్వర్ణ చరిత్ర

📰 Generate e-Paper Clip

కోలంబో, నవంబర్‌ 23,మనప్రజాప్రతినిధి:

ప్రపంచ అంధ మహిళల క్రికెట్‌లో భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. తొలిసారిగా నిర్వహించిన అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆది నుంచి చివరి వరకు అద్భుత ఆటతీరుతో అదరగొట్టి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. కొలంబోలోని సరా ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో నేపాల్‌పై ఘనవిజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. క్రమశిక్షణతో బంతులు విసిరిన భారత బౌలింగ్ యూనిట్ ప్రత్యర్థిని కేవలం 114 పరుగులకే పరిమితం చేసింది. కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపింది. ఆ తరువాత ఛేదనలో భారత బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు. ఓపెనర్ ఫులా సరేన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 44 పరుగులతో జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చింది. పదో ఓవర్‌కే స్కోర్ వంద దాటడంతో మ్యాచ్ దిశ పూర్తిగా భారత్‌వైపు మళ్లింది. కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
టోర్నీ మొత్తం భారత జట్టు ఆధిపత్యంతోనే సాగింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీమిండియా, చివరి పోరులోనూ అదే జోరు కొనసాగించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌తో అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చూపింది. ఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన ఫులా సరేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చేపట్టిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుంటూ, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తలవంచకుండా పోరాడిన ఈ అంధ మహిళల జట్టు దేశానికి గర్వకారణంగా మారింది. తొలి సీజన్‌లోనే ప్రపంచ టైటిల్ సాధించడం భారత అంధ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని క్రీడా విశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సోషల్ మీడియాలో భారత అంధ మహిళల జట్టును ప్రశంసల వర్షం కురుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular