శత్రు జలాంతర్గాములను వేటాడేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న యుద్ధనౌక
80% స్వదేశీ సాంకేతికతతో నిర్మాణం – ఆత్మనిర్భర్ భారత్‌కు నూతన మైలురాయి
తీర ప్రాంత రక్షణలో భారత నౌకాదళానికి భారీ బలం
న్యూఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
భారత నౌకాదళం శత్రు జలాంతర్గాములను వేటాడే నూతన తరం యుద్ధనౌక ఐఎన్ఎస్ మాహెను అధికారికంగా తన అమ్ములపొదిలోకి చేర్చుకుంది. తీర ప్రాంతాల్లో లోతు తక్కువ నీటిలో సైతం అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్లు చేపట్టగలిగే ఈ యాంటీ–సబ్‌మెరైన్ షాలో-వాటర్ క్రాఫ్ట్ రాకతో భారత తీర రక్షణ సామర్థ్యం భారీగా పెరగనుంది. దీనిని నేవీ ‘సైలెంట్ హంటర్’ (నిశ్శబ్ద వేటగాడు)గా పేర్కొంది. 80 శాతం స్వదేశీ పరికరాలు, దేశీయ సాంకేతికతతో ఈ నౌకను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ వైపు నౌకా నిర్మాణ రంగం సాధించిన అద్భుత పురోగతికి ప్రతీకగా నిలుస్తోందని నేవీ అధికారులు తెలిపారు. తీరానికి సమీపంలోని ఇరుకైన జలాల్లో వేగంగా కదలగలిగేలా, శత్రు నిఘా వ్యవస్థలకు కనబడకుండా ఆపరేషన్లు నిర్వహించేలా ప్రత్యేక డిజైన్ చేశారు. తీర ప్రాంతాల్లో జలాంతర్గాములను ట్రాక్ చేసి, వాటిని నిర్వీర్యం చేయడం ప్రధాన లక్ష్యంగా ఐఎన్ఎస్ మాహె రూపుదిద్దుకుంది. యాంటీ-సబ్‌మెరైన్ ఆపరేషన్లతో పాటు తీర గస్తీ, నీటి అడుగున మైన్‌ల అమరిక, లోతు తక్కువ ప్రాంతాల్లో నిఘా నిర్వహణ వంటి పనులను సైతం ఇది సమర్థంగా చేయగలదు. 78 మీటర్ల పొడవు కలిగిన ఈ యుద్ధనౌక 1,100 టన్నుల బరువు మోయగలదు. గరిష్ఠంగా గంటకు 25 నాట్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ నౌక, ఒకసారి ఇంధనం నింపితే 1,800 నాటికల్ మైళ్లు ప్రయాణించి, 14 రోజులపాటు నిరంతరాయంగా విధుల్లో పాల్గొనే సామర్థ్యం కలిగి ఉంది. ఈ నౌకలో మధ్య-ఫ్రీక్వెన్సీ సోనార్, మల్టీఫంక్షన్ రాడార్, ఇంటిగ్రేటెడ్ కంబాట్ మేనేజ్‌మెంట్ సూట్, అధునాతన పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రిమోట్ కంట్రోల్ 30 ఎంఎం గన్, తేలికపాటి టార్పెడోలు, మల్టీరోల్ రాకెట్ లాంచర్లు, మైన్ అమరిక రైళ్లు వంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అమర్చారు. వీటి సమ్మిళిత శక్తితో మాహె శత్రు జలాంతర్గాములను వేగంగా గుర్తించి, ఖచ్చితంగా లక్ష్యబద్ధంగా దాడి చేయగలదు. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం ‘మాహె’ పేరు ఈ యుద్ధ నౌకకు పెట్టారు. దీని చిహ్నంలో కలరిపయట్టు యుద్ధ విద్యలో ఉపయోగించే ‘ఉరుమి’ (వంగే కత్తి) చిత్రాన్ని పొందుపర్చడం ప్రాణాంతకమైన కచ్చితత్వం నేవీ పేర్కొంది. భారత నౌకాదళం ఆర్డర్ చేసిన ఎనిమిది ASW-SWCలలో ఐఎన్ఎస్ మాహె మొదటిది. మిగిలిన ఏడు నౌకలు 2027 నాటికి నేవీ సేవల్లోకి చేరనున్నాయి. వీటి రాకతో పాతబడిన అభయ్-క్లాస్ కార్వెట్ల స్థానాన్ని భర్తీ చేస్తూ, భారత తీరరక్షణ మరింత బలపడనుంది. హిందూ మహాసముద్రంలో శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేసే సామర్థ్యాన్ని మాహె శ్రేణి కొత్త స్థాయికి తీసుకెళ్లనుందని నిపుణులు భావిస్తున్నారు.

