📄 ePaper
Saturday, August 29, 2026
Homeఇంటర్నేషనల్విమాన రద్దుపై ప్రయాణికులకు ఊరట.. - చివరి నిమిషంలోనూ 80 శాతం రీఫండ్‌కు మార్గం

విమాన రద్దుపై ప్రయాణికులకు ఊరట..
– చివరి నిమిషంలోనూ 80 శాతం రీఫండ్‌కు మార్గం

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, నవంబర్ 23
మనప్రజాప్రతినిధి:
విమాన ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పే దిశగా కీలక నిర్ణయాలపై కసరత్తు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విమానం బయలుదేరే కొద్దిసేపు ముందే టికెట్ రద్దు చేసుకున్నా కూడా, టికెట్ మొత్తంలో పెద్ద భాగాన్ని తిరిగి పొందేలా కొత్త విధానం తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, నో షో అంటూ ఇప్పటివరకు ప్రయాణికుల డబ్బు కోల్పోయిన పరిస్థితులకు పెద్ద ఊరట దక్కనుంది.
ప్రస్తుతం విమానం బెయిలవేసే మూడు గంటల ముందు టికెట్ రద్దు చేస్తే లేదా ప్రయాణికుడు హాజరుకాకపోతే, ఎయిర్‌లైన్స్ దానిని ‘నో షో’గా పరిగణించి రీఫండ్ ఇవ్వని పరిస్థితి ఉంది. కొన్నిసార్లు వైద్య అత్యవసర పరిస్థితులను నిరూపించినప్పుడు మాత్రమే కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తున్నారు. అయితే దీనిపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో, ఇకపై టికెట్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి భాగంగా చేర్చే ప్రతిపాదనపై పౌర విమానయాన శాఖ పని చేస్తోంది.
ఈ ఇన్సూరెన్స్ విధానం అమలులోకి వస్తే, చివరి నిమిషంలో రద్దు చేసుకున్నా కూడా టికెట్ మొత్తంలో సుమారు 80 శాతం వరకు తిరిగి పొందే అవకాశం కలుగుతుందని సమాచారం. అందుకు అవసరమైన ప్రీమియం భారం ప్రయాణికులపై కాకుండా ఎయిర్‌లైన్స్ కంపెనీలే భరించేలా ఒప్పందాలు కుదుర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఈ దిశగా చర్చలు మొదలుపెట్టినట్టు అధికారికంగా తెలిసింది.
ఇదే సమయంలో టికెట్ రీఫండ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చేందుకు డీజీసీఏ కూడా నిబంధనల సవరణపై దృష్టి పెట్టింది. రీఫండ్ ఆలస్యం, కారణాలు లేకుండా తిరస్కరణలు వంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ఠమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు ముసాయిదా నిబంధనలపై పని జరుగుతోంది. రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో ఈ కొత్త నియమాలు అమలులోకి వచ్చే అవకాశముందని పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ మార్పుల ద్వారా విమాన ప్రయాణికుల హక్కులు మరింత బలపడతాయని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి పెద్ద ఊరట కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో విమాన రద్దు విషయంలో ఇప్పటిదాకా ఉన్న భారం, అసహనం కొంత మేర తగ్గుతుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.