Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుచేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమే అండగా నిలవాలి: కవిత

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమే అండగా నిలవాలి: కవిత

📰 Generate e-Paper Clip

– వనపర్తి కొత్తకోటలో జాగృతి ‘జనం బాట’
– చేనేత కార్మికుల దుర్భర పరిస్థితిపై ఆందోళన
– పద్మశాలీలకు ప్రాధాన్యం, బీసీలకు రాజ్యాంగ రిజర్వేషన్లపై డిమాండ్

కొత్తకోట. నవంబర్ 23. మనప్రజాప్రతినిధి.

వనపర్తి జిల్లా కొత్తకోటలో చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, చేనేత రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. చేనేతే నాగరికతకు ప్రతీకైనా, దానిని నేసే కార్మికులు దయనీయ జీవితాలు గడుపుతున్నారనే విషయాన్ని ఆమె ఆవేదనగా ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్, నూలుకు సబ్సిడీ అందించడంతో కొంత ఊరట లభించిందని కవిత గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ కాలంలో సబ్సిడీలు నిలిచిపోవడం వల్ల కార్మికులు మరింత కష్టాల్లోకి నెట్టబడుతున్నారని ఆమె అన్నారు. చేనేత కుటుంబంలో ఒక్కరికి చేనేత పెన్షన్ వచ్చినా, సాధారణ పెన్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చీరలు నేసినా, సొంతంగా వ్యాపారం చేయలేక కూలీ పనులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని కవిత పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేసి, లోన్లు అందజేస్తేనే చేనేత రంగానికి కొంత ప్రోత్సాహం లభిస్తుందని సూచించారు. కొత్త తరం ఈ కళను అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ అండ తప్పనిసరిగా అవసరమని, లేనిపక్షంలో చేనేత కళ అంతరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పద్మశాలీల జనాభా పెద్దది అయినప్పటికీ ఏ ప్రధాన రాజకీయ పార్టీ వారిని నిర్ణాయక పదవుల్లోకి తీసుకురాలేదని ఆమె విమర్శించారు. అన్నిరాజకీయ పార్టీలూ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, అదే విధంగా బీసీ వర్గాలకు పార్టీల ఆధారంగా కాకుండా రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే వర్గాల తరఫున సమస్యలు ప్రభుత్వ స్థాయిలో ధైర్యంగా చెప్పగలరని అభిప్రాయపడ్డారు.
కొత్తకోట చేనేత కళాకారుల కష్టాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు కవిత చెప్పారు. బట్ట నేయడంలో వారు పడుతున్న శ్రమ అపారమని, వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జాగృతి తరఫున కూడా వీలైనంత సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular