మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్29:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్.ఎం.పి (RMP) డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హమీద్ (47), తండ్రి ఇస్మాయిల్, సోమవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఛాతీలో మంటగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన వారు అతడిని వెంటనే బద్దెనపల్లి గ్రామంలోని ఆర్.ఎం.పి డాక్టర్ మచ్చ పర్శరాములు వద్దకు తీసుకెళ్లారు.హమీద్‌ను పరిశీలించిన డాక్టర్ రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. అయితే ఇంజక్షన్ వేసిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే హమీద్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికీ స్పృహ రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడి వైద్యులు పరీక్షించి హమీద్ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఆర్.ఎం.పి డాక్టర్ నిర్లక్ష్యంగా చికిత్స చేయడమే తన భర్త మృతికి కారణమని మృతుడి భార్య శాబేర కన్నీటి పర్యంతమయ్యారు.మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు ఆర్.ఎం.పి డాక్టర్ మచ్చ పర్శరాములుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంజక్షన్ వికటించి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
RELATED ARTICLES

