Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

📰 Generate e-Paper Clip

పాపన్నపేట, డిసెంబర్02(మనప్రజాప్రతినిధి):
ఈ నెల 11న జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం అనంతుని కొత్తపల్లి గ్రామంలోని అనంత పద్మనాభ ఫంక్షన్ హాల్‌లో సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సిఎం తాండ, ఎల్లిపేట్, ఎల్పుగొండ గ్రామాలతో పాటు కొత్తపల్లి, అబ్లపూర్, అన్నారం గ్రామాల ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, అధికారుల విధులకు ఆటంకం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా మార్గం లేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వ్యక్తులను ఇప్పటికే బైండోవర్ చేసినట్లు, వారి‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.అభ్యర్థులు మద్యం, డబ్బులు లేదా ఇతర ప్రలోభాలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు క్యూ లైన్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు, అన్ని పార్టీల నాయకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ జార్జ్, ఎస్బీ సీఐ సందీప్ రెడ్డి, సీసీఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular