మనప్రజాప్రతినిధి//కొండపాక (కుక్కునూరు పల్లి):
ఆస్తి కోసం కన్న తల్లిలాంటి అత్తను అల్లుడే తన స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. ఈ నెల 6న కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని సార్లవాడ లో జరిగిన మహిళ హత్య కేసు వివరాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు శుక్రవారం కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం..
తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఏలూరు రమ అలియాస్ రాములమ్మ (60) భర్త మృతి చెందడంతో సార్లవాడలో చాయ్ హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు చెందిన మూడు ఎకరాల భూమిపై కన్నేసిన అల్లుడు, ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డి (30), ఆస్తి దక్కించుకునేందుకు హత్యకు పథకం రచించాడు.గత ఆరు నెలల క్రితం రాత్రి సమయంలో మృతురాలు నివసిస్తున్న ఇంటి వెనుక భాగంలో నిప్పు పెట్టి హత్యాయత్నం చేయగా ఆమె అప్రమత్తతతో తప్పించుకుంది. అయినా వెనక్కి తగ్గని అల్లుడు, ఈ నెల 6న మధ్యాహ్నం తన స్నేహితులు పాండు తదితరులతో కలిసి ఇంట్లోకి చొరబడి తలుపులు బిగించి, తువ్వాలతో మెడ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.
సమాచారం అందుకున్న వెంటనే తొగుట సీఐ లతీఫ్, ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రధాన నిందితుడు జీవన్ రెడ్డి సహా ఇతరులు నేరాన్ని అంగీకరించడంతో,
మూడు బైకులు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు,
ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మొత్తం 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్, పోలీసు సిబ్బందిని ఏసీపీ నర్సింలు అభినందించారు.
తల్లిలాంటి అత్తను అల్లుడే తన స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది..
RELATED ARTICLES

