Friday, February 27, 2026
ads
Homeతెలంగాణఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ లో సిండికేట్' రాజ్యం..

ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ లో సిండికేట్’ రాజ్యం..

📰 Generate e-Paper Clip

_మందుబాబుల జేబులకు చిల్లు, బెల్ట్ షాపుల యజమానుల లబోదిబో..

మనప్రజాప్రతినిది
రాజన్న సిరిసిల్ల
జనవరి, 11

ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వైన్స్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి, ఒక సిండికేట్‌గా ఏర్పడి మందుబాబులను, బెల్ట్ షాపుల నిర్వాహకులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వ ధరల (MRP) కంటే అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యుల పొట్ట కొడుతున్నారు.
ఎంఆర్‌పి మర్చిపోయిన నిర్వాహకులు
ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట పరిధిలోని వైన్ షాపుల్లో ప్రతి క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 అదనంగా వసూలు చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే, కస్టమర్ల నుంచి మరియు బెల్ట్ షాపు నిర్వహకుల దగ్గర అధిక ధర వసూలు చేస్తున్నప్పటికీ, బిల్లు మాత్రం ఎంఆర్‌పి ధరకే ఇస్తుండటం గమనార్హం. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే “మేము ఇంతే అమ్ముతాం.. మీకు ఇష్టముంటే తీసుకోండి లేకపోతే లేదు” అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బెల్ట్ షాపులపై ప్రభావం
వైన్స్ నిర్వాహకుల సిండికేట్ ధోరణితో గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోనే అధిక ధరకు కొనాల్సి రావడంతో, వారు తమ జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
అధికారుల మౌనం.. ‘డీల్’ కుదిరిందనే ఆరోపణలు
ఈ అక్రమాలపై గతంలో పలు పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం కనీస చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఎక్సైజ్ శాఖ అధికారులకు, వైన్స్ నిర్వాహకులకు మధ్య భారీ స్థాయిలో ‘డీల్’ కుదిరిందని, అందుకే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
పర్యవేక్షణ కరువు
క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో సిండికేట్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్‌లో జరుగుతున్న ఈ దోపిడీపై విచారణ జరిపి, బాధ్యులైన వైన్స్ నిర్వాహకులపై మరియు విధి నిర్వహణలో వైఫల్యం చెందిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular