•మహిళా శక్తికి భరోసా-వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
•మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం-జోగిపేటలో వడ్డీ లేని రుణాల పంపిణీ
•మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వ పెద్ద అడుగు
•వడ్డీ భారానికి చెక్ -మహిళా సంఘాలకు రుణాలు
మెదక్,జనవరి20(మనప్రజాప్రతినిధి):
జోగిపేట పట్టణంలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వ హించిన కార్యక్రమంలో ఆందోల్–జోగిపేట పట్టణ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆందోల్–జోగిపేట ప్రాంతానికి చెందిన 327 మహిళా సంఘాలు, సుమారు 3,400 మంది సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాలకు స్వంత భవనాలు, సమావేశాల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో జోగిపేట, ఆందోల్ ప్రాంతాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు దారి చూపించిన మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి బీజం వేశారని గుర్తు చేశారు. ఆయన పాలనలో మండల సమాఖ్యలకు రూ.50 లక్షల నిధులు, పావలా వడ్డీ రుణాల పథకాన్ని ప్రవేశపెట్టారని, రుణాలు సమయానికి చెల్లించే సంస్కృతిని ఆయనే తీసుకొచ్చారని తెలిపారు.అనంతరం 2013లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగించగా, 2023లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రారంభించిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని, దాదాపు రూ.40 వేల కోట్ల రుణాలకు సంబంధించి రూ.74.26 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఆందోల్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించా లనే ఉద్దేశంతో ఆందోల్‌లో ఐదు ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. అలాగే మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ, సన్నబియ్యం సరఫరా, ఆర్టీసీ బస్సు సౌకర్యాల మెరుగుదల వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, పీడీ మెప్మా ఎస్.బి. రామాచారి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, అగ్రికల్చరల్ ఏడీఏ రమాదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి. ఫారుక్, డీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ ఆసియా సుల్తానా, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఎస్‌హెచ్‌జీ గ్రూప్ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

