– నాగోల్‌లో ప్రేమ విషాదం
– ప్రియుడి అనుమానంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):
హైదరాబాద్ నగరంలోని నాగోల్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు అనుమానించాడనే మనస్తాపంతో ఓ యువతి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు కారణమైన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఐశ్వర్య (19) తన అన్నతో కలిసి నాగోలు సమీపంలోని తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీలో నివసిస్తోంది. ఆమె దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఏడాది క్రితం ఓ పూజలో పరిచయమైన వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, మొదట నిరాకరించిన పెద్దలు తర్వాత అంగీకరించినట్లు సమాచారం.
అయితే, ఐశ్వర్య తరచూ ఫోన్‌లో వేరొకరితో మాట్లాడుతోందని ఆనంద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 5న ఇద్దరూ హౌసింగ్ బోర్డు కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫోన్ కాల్స్ విషయమై ఆనంద్ ఆమెను నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య, క్షణికావేశంలో వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకేసింది.
తీవ్ర గాయాలైన ఐశ్వర్యను నాగోల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆనందే కారణమని ఐశ్వర్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మహేష్ అలియాస్ ఆనంద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

