•రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు.ప్రభుత్వం మీ వెన్నంటే ఉంది
•మృత రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నంగునూరు,జనవరి12(మనప్రజాప్రతినిధి):
పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వంపనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపురం గ్రామంలో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న ఎల్ల రాజిరెడ్డి (50), అలాగే గుండెపోటుతో మృతి చెందిన గణపురం రాములు (45) కుటుంబాలను సోమవారం రాత్రి మంత్రి పరామర్శించారు.ఈ సందర్భంగా రెండు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అప్పుల బాధతో రైతు ఎల్ల రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం పత్రికల ద్వారా తెలుసుకుని తీవ్రంగా కలత చెందానని మంత్రి తెలిపారు. బాధ్యత గల మంత్రిగా కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు స్వయంగా వచ్చినట్లు చెప్పారు.
వ్యవసాయం గిట్టుబాటు కాక, అదనపు వ్యాపారం ప్రయత్నంలో అప్పుల పాలయ్యాడని తెలిసి హృదయం కలిచివేసిందని అన్నారు. రాజిరెడ్డి భార్య వేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. మృత రైతు కుమారునికి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతు బీమా పథకం కింద కూడా కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.అదే గ్రామానికి చెందిన గణపురం రాములు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి వ్యక్తిగత సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంతో పాటు పేదలకు విద్య, వైద్య రంగాల్లో పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య అవసరాల కోసం రూ.600 కోట్లకు పైగా మంజూరు చేసినట్లు వెల్లడించారు.వైద్యం చేయించుకునే స్థోమత లేని పేదలు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లోగా రూ.3 లక్షల వరకు ఎన్ఓసీ జారీ చేస్తున్నామని తెలిపారు. రైతులు, పేదలు ధైర్యంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
RELATED ARTICLES

