Friday, February 27, 2026
ads
Homeఎడిటోరియల్న్యాయవ్యవస్థ పై పెరుగుతున్న భారం

న్యాయవ్యవస్థ పై పెరుగుతున్న భారం

📰 Generate e-Paper Clip

– కేసుల భారంతో  కుంగిపోతున్న కోర్టులు
– లక్షల కేసులు తీరని పెండింగ్
– ఆలస్యమైన న్యాయం.. అన్యాయంగా మారుతోందా?
– వ్యవస్థ సంస్కరణలు ఎప్పుడూ?

గంజాయి శ్రీనివాస్ జనవరి 7 (మనప్రజాప్రతినిధి):

దేశ న్యాయవ్యవస్థ నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల భారం రోజురోజుకీ పెరుగుతుండగా, వాటి పరిష్కారం మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. సివిల్ వివాదాలు, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు… ఇలా ప్రతి విభాగంలోనూ లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌లోనే మగ్గిపోతున్నాయి. ఫలితంగా కోర్టుల పని తీరు ప్రజల ఆశలను అందుకోలేకపోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా కోర్టుల నుంచి హైకోర్టుల వరకూ ఒకే పరిస్థితి కనిపిస్తోంది. న్యాయమూర్తుల కొరత, కోర్టు సిబ్బంది లోపం, మౌలిక వసతుల అసమర్థత సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ఒక న్యాయమూర్తిపై వందల కేసుల భారం పడటంతో రోజుకు కొద్ది కేసులే విచారణకు వస్తున్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడుతూ కేసులు సంవత్సరాల తరబడి సాగుతుండటం సాధారణమైపోయింది.
ఈ ఆలస్యం సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధితులు ఆర్థికంగా కుంగిపోతున్నారు. న్యాయ ఖర్చులు భరించలేక మధ్యలోనే కేసులు వదిలేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొందరికి న్యాయం దక్కేలోపే జీవిత కాలం ముగిసిపోవడం మన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారుతోంది.
న్యాయం ఆలస్యం కావడంతో న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటోంది. “చట్టం ఉంది… కానీ న్యాయం దూరం” అన్న భావన బలపడుతోంది. నేరస్తులు శిక్ష పడదన్న ధైర్యంతో బయట తిరగడం, బాధితులు నిస్సహాయంగా మిగలడం సమాజంలో అసమానతలను పెంచుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక డిజిటలైజేషన్ పేరుతో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ అవి సరిపడా ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఈ–కోర్టులు, వీడియో విచారణలు, ఆన్‌లైన్ ఫైలింగ్ వంటి చర్యలు అమలులో ఉన్నా, వాటి పూర్తి ప్రయోజనం ఇంకా గ్రామీణ స్థాయికి చేరలేదు. సాంకేతికతను సమర్థంగా వినియోగించడంలో వ్యవస్థ వెనుకబడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే తక్షణ సంస్కరణలు అవసరం. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను వేగంగా భర్తీ చేయడం, కొత్త కోర్టులను ఏర్పాటు చేయడం, కేసుల వర్గీకరణ ద్వారా త్వరిత పరిష్కార మార్గాలు రూపొందించడం అత్యవసరం. చిన్న వివాదాలను రాజీ మార్గాల్లోనే పరిష్కరించే విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ప్రభుత్వ శాఖలే పెద్ద ఎత్తున కేసులకు కారణమవుతున్నాయన్న ఆరోపణలపై కూడా సమీక్ష జరగాలి. అనవసర అప్పీలు, విధానపరమైన జాప్యాలు తగ్గితేనే కోర్టులపై భారం కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. చట్టం అమలు చేసే సంస్థల నుంచే మార్పు మొదలవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే… కేసుల భారంతో కోర్టులు కుంగిపోతున్నాయన్న ఆందోళన కేవలం ఊహ కాదు, నేటి వాస్తవం. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే న్యాయం అనేది పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ప్రజలకు వేగంగా, న్యాయంగా తీర్పు అందించే వ్యవస్థను నిర్మించడం ఇప్పుడు పాలకుల ముందున్న అతి పెద్ద సవాలుగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular