•సమాచారం ఇస్తే తప్పులు బయటపడతాయన్న భయమా?
•నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్టీఐ చట్టానికి తూట్లు
తిరుపతిజిల్లా,నాయుడుపేట(మనప్రజాప్రతినిధి):జనవరి12
పేరుకే మండల ప్రజా పరిషత్ కార్యాలయం… కానీ అక్కడ ప్రజల సమస్యలను పట్టించుకునే వారే లేరని నాయుడుపేట మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను లెక్కచేయకుండా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులే దీనికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం మండలానికి సంబంధించిన వివరాలను కోరుతూ 2025 నవంబర్ 27న దరఖాస్తు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదని వాపోతున్నారు. చట్టంలో పేర్కొన్న గడువు దాటిపోయినా స్పందన లేకపోవడం ద్వారా అధికారులు చట్టాన్ని పూచికపుల్లతో సమానంగా భావిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సమాచార హక్కు చట్టాన్ని అవహేళ న చేస్తూ, కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా వ్యవహరించడం తీవ్రమైన ఉల్లంఘనగా ప్రజలు పేర్కొంటున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీలు స్వీకరిస్తున్నా, ఆ అర్జీలు కార్యాలయ అటక మీదకే పరిమిత మవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.“సమాచార హక్కు చట్టానికే దిక్కు లేకపోతే, సోమవారం తీసుకునే అర్జీల పరిస్థితి ఏంటి?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చట్టాలపై నమ్మకంతో అనేక మంది ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు చేసుకుంటుంటే, కొందరు బద్ధకపు అధికారుల నిర్లక్ష్యంతో ఆ నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం పౌర సమాచార అధికారికి ప్రతి నెల జీతం చెల్లించేది ప్రజలకు సమాచారం అందించేందుకే కదా? గుమ్మడికా యంత జీతం తీసుకుని ఆవగింజంతైనా పని చేయాల్సిన బాధ్యత లేదా? అంటూ ప్రజలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రజలకు సమయానికి సమాచారం ఇవ్వలేని మండల ప్రజా పరిషత్ కార్యాలయ అధికారులు ఇక మండలాన్ని ఎలా అభివృద్ధి చేస్తారోనని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. సంబంధిత దరఖాస్తుదారుడు ఇప్పటికే ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లడమే కాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పౌర సమాచార అధికారి తీరుపై జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పౌర సమాచార అధికారి బద్ధకం… ప్రజల సహనానికి పరీక్ష
RELATED ARTICLES

