•డ్రోన్.నిఘా…ప్రత్యేకపోలీస్ బృందాలతోజిల్లావ్యాప్తంగా కఠినచర్యలు – పాల్గొన్నా,నిర్వహించినా కేసులు తప్పవు
•జూదానికి జీరో టాలరెన్స్-తిరుపతి పోలీసులు అలర్ట్
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.జనవరి13
సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందాలు, పేకాట, మట్కా వంటి చట్ట వ్యతిరేక క్రీడలకు తిరుపతి జిల్లా పోలీసులు పూర్తిస్థాయి బ్రేక్ వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహించినా, పాల్గొన్నా నేరమేనని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు ఐపీఎస్. స్పష్టంగా హెచ్చరించారు.
సంప్రదాయం ముసుగులో జీవ హింసకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, కోడి పందాలు నిర్వహించిన నిర్వాహకులు మాత్రమే కాదు… వాటికి స్థలాలు ఇచ్చిన వారు, పందేలలో పాల్గొన్న వారందరూ చట్ట పరిధిలోకి వస్తారని తెలిపారు.డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బృందాలతో జిల్లా వ్యాప్తంగా నిఘా ఉక్కుపాదంలా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, మూగజీవాల సంక్షేమ బోర్డు సభ్యులు, ఎన్జీవోలతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.కోడి పందేల కోసం కోళ్లకు కత్తులు కట్టిన వారు, కత్తులు తయారు చేసినా లేదా సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జూదం వల్ల సులభంగా డబ్బులు వస్తాయన్న భ్రమలో పడి ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సంక్రాంతిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, క్రికెట్ వంటి ఆరోగ్యకరమైన క్రీడల వైపు ప్రజలు మళ్లాలని సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112, పోలీస్ వాట్సాప్: 80999 99977 కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

