– రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
– బీజేపీకి షాక్… బీఆర్‌ఎస్‌లో చేరిన పత్రి శ్రీనివాస్
సిద్దిపేట, జనవరి 9 (మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామనే కుట్రలను సహించబోమని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హెచ్చరించారు. సిద్దిపేటలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్‌తో పాటు సీనియర్ నాయకుడు హనుమంత్ రావు తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, “నాపై కోపం ఉంటే నా మీద చూపించు రేవంత్ రెడ్డి… కానీ సిద్దిపేట ప్రజలపై కాదు. 30–40 ఏళ్ల సిద్దిపేట ప్రజల కలను కేసీఆర్ నిజం చేసి జిల్లాను ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలు ఎక్కువయ్యాయని సాకు చెప్పి సిద్దిపేట జిల్లాను రద్దు చేసి మళ్లీ సంగారెడ్డిలో కలపాలని కుట్ర చేస్తున్నారు” అంటూ మండిపడ్డారు.
ఒకప్పుడు సిద్దిపేటలో మంచినీటి కష్టాలు ఎలా ఉండేవో ప్రజలకు బాగా తెలుసునని హరీష్ రావు గుర్తు చేశారు. “నీళ్ల కోసం సైకిళ్ల మీద తిరిగిన రోజులు పోయి, నేడు ఇంటింటికి నల్లా నీళ్లు వస్తున్నాయి. ఒకప్పుడు పందులు, మురికి కాలువలు గుర్తొచ్చే సిద్దిపేట… ఇప్పుడు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, వీధి దీపాలు, చెత్త సేకరణతో రాష్ట్రానికే మోడల్‌గా నిలిచింది” అని వివరించారు.
సిద్దిపేటను చదువుల తల్లిగా తీర్చిదిద్దామని చెప్పారు. మెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, నర్సింగ్, మహిళా డిగ్రీ కాలేజీలతో పాటు వైద్య రంగంలోనూ జిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు. కోమటి చెరువు పర్యాటక కేంద్రంగా మారి ఇతర జిల్లాల ప్రజలను ఆకర్షిస్తోందని, దేవాలయాల జిల్లాగా సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
“జిల్లా రద్దయితే కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, జిల్లా ఆసుపత్రి, ఎస్సీ, ఇరిగేషన్ కార్యాలయాలు అన్నీ పోతాయి. సిద్దిపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటాం” అని హరీష్ రావు స్పష్టం చేశారు.
ప్రభుత్వ హామీలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రూ.4000 పెన్షన్, మహిళలకు నెలకు రూ.2500, కల్యాణలక్ష్మి, తులం బంగారం, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ వంటి హామీలు ఏవీ అమలు కాలేదన్నారు. రైతుబంధు పడడం లేదని, ఎరువుల కోసం క్యూ లైన్లు కనిపిస్తున్నాయని, పంటలు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
“సిద్దిపేట అంటే నా కుటుంబం. దసరా అయినా, రంజాన్ అయినా మీ మధ్యలోనే ఉంటా. నా శక్తినంతా సిద్దిపేట అభివృద్ధికే ధారపోశాను. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనవాళ్లే గెలవాలి. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేదాకా, తెలంగాణ మళ్లీ బాగుపడేదాకా పోరాటం ఆగదు” అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్ గులాబీ గూటికి వచ్చామని తెలిపారు. ప్రజల అభివృద్ధి, ఆత్మగౌరవమే తమ రాజకీయ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం
RELATED ARTICLES

