📄 ePaper
Thursday, August 20, 2026
Homeఎడిటోరియల్నాగపంచమి వేళ పాముల రక్షణ

నాగపంచమి వేళ పాముల రక్షణ

📰 Generate e-Paper Clip

రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖ ప్రత్యేక చర్యలు
సంయుక్త బృందాలతో విస్తృత తనిఖీలు
17 నాగుపాములను రక్షించిన అధికారులు
పాములపై అపోహలు వీడాలని సూచన

ఆగస్టు17(మనప్రజాప్రతినిధి): నాగపంచమి సందర్భంగా పాములను పట్టుకుని ప్రదర్శించడం, హింసించడం, అక్రమంగా తరలించడం వంటి ఘటనలను అరికట్టేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేస్తూ పాముల రక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ మేరకు అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. పాముల అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు వాటిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు యాంటీ పోచింగ్ స్క్వాడ్లు, స్థానిక అటవీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, మార్కెట్లు, బస్‌స్టాండ్లు, రవాణా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పాములాడించే వారి వద్ద ఉన్న నాగుపాములు, ఇతర జాతుల పాములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని రక్షణ కల్పిస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేకంగా ఎనిమిది తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి చెందిన సుమారు 25 మంది సభ్యులు అటవీ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 17 నాగుపాములను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షించిన పాములకు అవసరమైన వైద్య చికిత్స అందించి వాటిని సురక్షిత అటవీ ప్రాంతాల్లో విడిచిపెడుతున్నట్లు తెలిపారు. నాగపంచమి సందర్భంగా పాములకు పాలు పోయడం వల్ల వాటికి హాని కలుగుతుందని అటవీ శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పాములు సహజంగా పాలను జీర్ణించుకోలేవని, వాటికి పాలు తాగించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జీవ పాములను ఉపయోగించి పూజలు నిర్వహించకుండా పాము ప్రతిమలకు మాత్రమే పూజలు చేయాలని భక్తులకు సూచిస్తున్నారు.
పాములు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షిత జీవులని అటవీ శాఖ స్పష్టం చేసింది. వాటిని పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శించడం లేదా అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొంది. ఈ నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పాముల సంరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరింది. పాములాడించే వారి వద్ద జీవ పాములు ఉన్నట్లు గుర్తించినా లేదా ఎక్కడైనా పాములను అక్రమంగా పట్టుకున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రకృతి సమతుల్యతలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. నాగపంచమి పర్వదినాన్ని జీవరాశుల పరిరక్షణ సందేశంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.