Friday, February 27, 2026
ads
Homeతెలంగాణసిబిల్ స్కోర్‌లో పొరపాట్లు..

సిబిల్ స్కోర్‌లో పొరపాట్లు..

📰 Generate e-Paper Clip

– వెంటనే సరిచేయకపోతే లోన్ డేంజర్‌లో పడినట్టే

హైదరాబాద్, నవంబర్ 23,మనప్రజాప్రతినిధి:

నేటి బ్యాంకింగ్ వ్యవస్థలో సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత రుణం కావాలన్నా, గృహ రుణం తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డు అప్లై చేయాలన్నా మొదట బ్యాంకులు చూసేది సిబిల్ స్కోర్‌నే. ఇది 750 కంటే ఎక్కువగా ఉంటేనే చాలా బ్యాంకులు రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. అలాంటప్పుడు సిబిల్ స్కోర్‌లో చిన్న పొరపాటు ఉన్నా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. చాలామంది “ఏమీ కాదు” అని వదిలేస్తారు కానీ అదే తప్పు భవిష్యత్తులో లోన్ రిజెక్షన్‌కు కారణమవుతుంది.
సిబిల్ స్కోర్‌ను రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండటం వల్ల మీ వ్యక్తిగత వివరాల్లో, అకౌంట్ డేటాలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. పేరు, పాన్ నంబర్, ఆధార్, చిరునామా లాంటి వివరాలు తప్పుగా నమోదు అయినా, మీరు చెల్లించని లేట్ పేమెంట్స్ మీ పేర మీద కనిపించినా, క్లోజ్ అయ్యి లోన్ ఇంకా ఓపెన్‌గా చూపించినా ఇవన్నీ సిబిల్ స్కోర్‌ను నాశనం చేస్తాయి. ఇలాంటి పొరపాట్లు చాలాసార్లు బ్యాంక్ లేదా క్రెడిట్ బ్యూరో డేటా ఎంట్రీ తప్పుల వల్ల జరుగుతుంటాయి.
సిబిల్ స్కోర్‌ను ప్రతి ఏడాది ఒక్కసారి ఉచితంగా చెక్ చేసుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. ఆర్‌బీఐ ఆమోదం పొందిన నాలుగు క్రెడిట్ బ్యూరోలు అయిన సిబిల్, సీఆర్‌ఐఎఫ్ హై మార్క్, ఎక్స్పీరియన్, ఈక్విఫ్యాక్స్ ద్వారా మీరు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పొందవచ్చు. ఆయా అధికారిక వెబ్‌సైట్లలోకి వెళ్లి మీ పాన్ నంబర్, మొబైల్ నంబర్, జన్మతేది వివరాలు ఇచ్చి లాగిన్ అయితే పూర్తి రిపోర్ట్ లభిస్తుంది.
రిపోర్ట్ వచ్చిన తర్వాత ముందుగా మీ వ్యక్తిగత వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లు, లోన్లు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐ వివరాలు కరెక్ట్‌గా నమోదయ్యాయా లేదా చూసుకోవాలి. మీరు ఇప్పటికే క్లోజ్ చేసిన లోన్ ఇంకా ఆన్‌డీగా చూపిస్తే లేదా మీరు ఎప్పుడూ తీసుకోని కార్డు మీ పేర మీద ఉంటే, వెంటనే క్రెడిట్ బ్యూరోకి డిస్ప్యూట్ రైజ్ చేయాలి. సంబంధిత ఆప్షన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. మీరే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేస్తే, బ్యూరో బ్యాంకులతో వెరిఫై చేసి కొద్ది రోజుల్లో మార్పులు చేస్తుంది.
అలాగే అవసరమైతే ఆయా బ్యాంక్ బ్రాంచ్‌లను కూడా సంప్రదించి, మీ లోన్ లేదా కార్డ్ వివరాలపై క్లారిటీ తీసుకోవాలి. డాక్యుమెంట్స్‌ను చూపించి రాతపూర్వకంగా రిక్వెస్ట్ ఇవ్వడం వల్ల సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశముంది. సిబిల్ స్కోర్ అనేది మీ ఆర్థిక విశ్వసనీయతకు సూచిక కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును ప్రమాదంలో పడేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటూ, ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలన్నది బ్యాంకింగ్ నిపుణుల సూచన.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular