Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణచవక రీచార్జ్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి సెన్సేషన్.. - రోజుకు కేవలం ₹6.74కే 72 రోజుల ప్లాన్

చవక రీచార్జ్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి సెన్సేషన్..
– రోజుకు కేవలం ₹6.74కే 72 రోజుల ప్లాన్

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, నవంబర్ 23 మనప్రజాప్రతినిధి:


ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలు రోజురోజుకు పెరుగుతుండగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తన చవక ప్లాన్‌లతో మళ్లీ మార్కెట్‌ను ఊపేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్ ప్లాన్ తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కస్టమర్ల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీగా వరుసగా కొత్త ఆఫర్లు తీసుకొస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్, తాజాగా 72 రోజుల ‘స్టార్ట్ సేవింగ్స్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.485 మాత్రమే. ఒక్కసారి రీచార్జ్ చేస్తే పూర్తి 72 రోజులు సేవలు అందుతాయి.
ఈ ప్లాన్‌లో వినియోగదారులకు దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తం మీద ఈ ప్లాన్ రోజుకు కేవలం రూ.6.74 మాత్రమే ఖర్చవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇలాంటి ప్రయోజనాల కోసం ఎక్కువ ధరలు వసూలు చేస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ ఇంత చవకగా ఈ సౌకర్యాలు ఇవ్వడం వినియోగదారులకు ఊరటనిచ్చే విషయంగా మారింది.
గతంలో రూ.251 విలువైన ప్లాన్‌తో ఆన్‌లిమిటెడ్ సదుపాయాలు అందించి మంచి స్పందన పొందిన బీఎస్‌ఎన్‌ఎల్, ఇప్పుడు ఈ కొత్త ప్లాన్‌తో మళ్లీ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తక్కువ ఆదాయం గల వర్గాల వినియోగదారులు ఈ ప్లాన్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అయితే, చవక ప్లాన్‌లు అందిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఉండటం, మార్కెటింగ్ తక్కువగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో వినియోగదారులకు చేరుకోలేకపోతున్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇటీవల 5జీ సేవలను కూడా ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్, నెట్‌వర్క్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తే మరింత పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రైవేట్ సంస్థల అధిక టారిఫ్‌లతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఈ 72 రోజుల రూ.485 ప్లాన్ నిజంగా చవక, చక్కటి ప్రత్యామ్నాయంగా మారే అవకాశముందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ మరిన్ని ఇలాంటి ప్లాన్‌లు తీసుకువచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular