📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లే

మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లే

📰 Generate e-Paper Clip

– రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రకటన
– మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం ప్రసంగం

గుంటూరు, జనవరి 5 (మనప్రజాప్రతినిధి):

మాతృభాష మన మూలాలకు, మన సంస్కృతికి ప్రతీక అని, ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో మూడు రోజులుగా నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. ‘‘సంక్రాంతికి ముందే వచ్చిన పండుగ ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు పేరును ఈ వేదికకు పెట్టడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
తెలుగు భాషకు అత్యంత ఘనమైన చరిత్ర ఉందని, దేశంలో వందలాది భాషలు ఉన్నప్పటికీ ప్రాచీన హోదా పొందిన ఆరు భాషల్లో తెలుగు ఒకటని సీఎం గుర్తుచేశారు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడే నాలుగో భాష తెలుగు అని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని వివరించారు. దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకావడం తెలుగు భాష గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.
ఆధునిక తెలుగు భాషకు పితామహుడైన గిడుగు వెంకట రామ్మూర్తి సేవలను తెలుగు జాతి ఎప్పటికీ మరువదని చంద్రబాబు కొనియాడారు. ‘‘నేను తెలుగువాణ్ణి.. నాది తెలుగుదేశం’’ అని గర్వంగా ప్రకటించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. 1985లోనే ఎన్టీఆర్ ముందుచూపుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించారని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత అదే స్ఫూర్తితో రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే భాషను మరింత సులభంగా పరిరక్షించుకోవచ్చని సీఎం సూచించారు. కొత్త యాప్‌లు, వాయిస్ టెక్నాలజీ ద్వారా తెలుగులో మాట్లాడినా సమాధానాలు లభిస్తున్నాయని, టైప్ చేయడం రాని వారు కూడా భాషను వినియోగించుకునే అవకాశాలు పెరిగాయని తెలిపారు.తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావి తరాలకు అందించేందుకు ఇలాంటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో దోహదపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనవరి 3న ప్రారంభమైన ఈ మహాసభలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.