•నకిలీ అగ్రిమెంట్లతో డీకేటీ భూముల స్వాధీనం యత్నం
•పంటలు ధ్వంసం…రైతులకు ప్రాణహాని బెదిరింపులు
•పట్టాలు ఉన్నా భయాందోళనలో రైతులు
•డీకేటీ భూములపై దాడులు-రైతుల ప్రాణాలకు ముప్పు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి23
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో భూకబ్జాదారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రభుత్వం పేద రైతులకు కేటాయించిన డీకేటీ భూములను లక్ష్యంగా చేసుకుని కొంతమంది అక్రమదారులు రోజుకో రూపంలో రైతులపై దాడులకు దిగుతూ మండలంలో భయాందోళన సృష్టిస్తున్నారు.భూమి అసలు యజమాని సాగు చేస్తూ భూమిలో ఉన్నప్పటికీ, నకిలీ అగ్రిమెంట్లతో తమకే హక్కులున్నాయని చెప్పుకుంటూ రైతులను చంపేస్తామని బెదిరించడం, పంటలను నాశనం చేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ రికార్డులు, పట్టా పాస్‌బుక్కులు, వన్‌బి ఆన్లైన్ నమోదు స్పష్టంగా ఉన్నా కూడా భూకబ్జాదారులు వెనుకడుగు వేయడం లేదు.శుక్రవారం ఏర్పేడు మండలం చిందేపల్లి రెవిన్యూ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. 1991లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని నాగంపల్లి గ్రామానికి చెందిన రైతు నడిపి రెడ్డి కుటుంబం సాగు చేసుకుంటుండ గా, భూకబ్జాదారులు అక్రమంగా భూమిలోకి చొరబడి సాగులో ఉన్న పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. “ఇది మా భూమి, మళ్లీ ఇక్కడ కనిపిస్తే చంపేస్తాం” అంటూ రైతు కుటుంబాన్ని ప్రాణహానీ బెదిరింపు లకు గురిచేశారు.ఈ భూమిని తాము ఎవరికీ అమ్మలేదని, ఎలాంటి అగ్రిమెంట్ కూడా రాయలేదని బాధిత రైతు స్పష్టంగా చెబుతున్న ప్పటికీ, భూకబ్జాదారుల దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది. పంట నాశనం కావడంతో రైతు కుటుంబం కన్నీటి పర్యంతమై, జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి నెలకొంది.రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతుకు పూర్తి రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే మండలంలోని పేద రైతుల భూములు ఒక్కొక్కటిగా భూకబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పేడు మండలంలో భూకబ్జాదారుల రాజ్యం!
RELATED ARTICLES

