– ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మోసగాళ్లపై నిఘా
– 12 మంది నకిలీ వైద్యులపై చర్యలు
– చికిత్సకు ముందు అర్హతలు పరిశీలించాలని సూచన
– అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
హైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): వైద్యం పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు హైదరాబాద్ పోలీసులు కట్టుబడి ఉన్నారని పేర్కొంటూ, ఇటీవలి కాలంలో నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా, కనీస వైద్య పరిజ్ఞానం కూడా లేని కొందరు వ్యక్తులు వైద్యులుగా నటిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని హెచ్చరించారు.
ఇలాంటి నకిలీ వైద్యులు రోగులకు విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, రక్తపోటు, మధుమేహం మందులు ఇవ్వడమే కాకుండా అవసరం లేకపోయినా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తున్నారని తెలిపారు. దీంతో రోగుల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు చికిత్స కోసం వెళ్లే ముందు క్లినిక్‌లు, ఆసుపత్రుల వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (డీఎంహెచ్‌వో) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌ఎంసీ) రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా ప్రదర్శించి ఉండాలని తెలిపారు.
వైద్యుల అర్హతలపై సందేహం ఉంటే టీఎస్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో డాక్టర్ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వివరాలను ధృవీకరించుకోవచ్చని పేర్కొన్నారు. అక్కడ వివరాలు కనిపించకపోతే ఆ వ్యక్తి అర్హతలేని వైద్యుడిగా భావించాలని సూచించారు. చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై అనుమానం వచ్చినప్పుడు మరో అర్హత కలిగిన వైద్యుడి వద్ద రెండో అభిప్రాయం తీసుకోవాలని చెప్పారు. నకిలీ వైద్యులు ఎక్కడైనా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్-112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సజ్జనార్ ప్రజలను కోరారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే ఇలాంటి మోసగాళ్లను పూర్తిగా అరికట్టగలమని ఆయన పేర్కొన్నారు.
నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్
RELATED ARTICLES



