📄 ePaper
Thursday, August 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుహరీష్‌రావు అరెస్టుతో వరంగల్‌లో ఉద్రిక్తత

హరీష్‌రావు అరెస్టుతో వరంగల్‌లో ఉద్రిక్తత

📰 Generate e-Paper Clip

ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నేత
– అరెస్టు యత్నాన్ని అడ్డుకున్న పార్టీ శ్రేణులు
– సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
– స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా

వరంగల్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావును హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో వరంగల్-హనుమకొండ ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి హరీష్‌రావు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వారితో కలిసి మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన కార్యక్రమానికి వెళ్లనున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హరీష్‌రావు తదుపరి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉద్యోగుల ధర్నా అనంతరం హరీష్‌రావును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు హరీష్‌రావును సుబేదారి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోలీసులు తీసుకున్న చర్యలను ఖండించారు.
హరీష్‌రావు అరెస్టు వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుబేదారి పోలీస్ స్టేషన్‌కు భారీగా తరలివచ్చారు. స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో హనుమకొండలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొనగా, ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం అణచివేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.