– గవర్నర్, సీఎం రెవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ సత్కారం
– హైదరాబాద్ చేరుకున్న వెంటనే గార్డ్ ఆఫ్ ఆనర్‌తో ప్రత్యేక ఆతిథ్యం
– రాష్ట్ర నాయకుల సమక్షంలో ఉపరాష్ట్రపతి మొదటి పర్యటన విశేషం
(హైదరాబాద్, నవంబర్ 16) (మనప్రజాప్రతినిధి):
భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ తన తొలి తెలంగాణ పర్యటనలో ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఘన స్వాగతం లభించింది. రాజ్‌భవన్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఏ. రెవంత్ రెడ్డి, కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆయనను ఆహ్వానించారు.
ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకొని రాష్ట్ర ప్రోటోకాల్ శాఖ ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వెంటనే రాధాకృష్ణన్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్ అందజేయడం ద్వారా ఆయనకు అధికారిక గౌరవం తెలిపింది. సైనిక దళాలు ఆయన ముందు మార్చ్ పాస్ట్ నిర్వహించగా, ఉపరాష్ట్రపతి దానిని స్వీకరించారు.తెలంగాణకు ఇది ఆయన తొలి పర్యటన కావడంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రతినిధులు ఆయనకు ఇచ్చిన ఆతిథ్యం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర సమన్వయం, పలు కీలక అంశాలపై ఈ పర్యటనలో చర్చలు జరగనున్నట్లు అధికారులు సూచించారు. రాబోయే కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రతినిధులతో ఉపరాష్ట్రపతి సమావేశం కానున్నారు.
ఉపరాష్ట్రపతి పర్యటన రాష్ట్ర రాజకీయ వాతావరణంతో పాటు పరిపాలనా రంగానికి కూడా కీలకంగా ఉందని తెలిసింది. తెలంగాణ కేంద్ర సంబంధాల బలోపేతానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు భావిస్తున్నారు.

