📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణడిసెంబర్‌లో బ్యాంకులకు 16 రోజులు సెలవులు..

డిసెంబర్‌లో బ్యాంకులకు 16 రోజులు సెలవులు..

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, నవంబర్‌ 25,మనప్రజాప్రతినిధి:

రోజూ బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే వారికి డిసెంబరు నెల కాస్త అప్రమత్తంగా ప్లాన్ చేసుకోవాల్సిన నెలగా నిలవబోతోంది. నెల మొత్తం 31 రోజుల్లో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఉండటం విశేషం. పైగా సంవత్సరం ముగింపు కావడంతో లావాదేవీల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడంతా మొబైల్, ఆన్‌లైన్ సేవల మీదే ఆధారపడుతున్నా, కొన్ని కీలక పనులకోసం బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం తప్పదు. అలాంటి వారు ముందుగానే సెలవులపై అవగాహన కలిగి ఉంటే ఇబ్బందులు తప్పుతాయి.
డిసెంబరు మొదటి వారంలోనే కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగల కారణంగా బ్యాంకులకు విరామం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌, నాగాలాండ్‌లో స్వదేశీ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఒకటో తేదీ సెలవుగా ఉండనుంది. గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ కారణంగా మూడో తేదీన బ్యాంకులు మూసి ఉంటాయి. పన్నెండో తేదీన మేఘాలయలో పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి సందర్భంగా సెలవు ఉంటుంది. పదమూడో తేదీ రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు.
మధ్య నెలలో మేఘాలయలో యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా పద్దెనిమిదో తేదీన, గోవా విముక్తి దినోత్సవం కారణంగా పంతొమ్మిదో తేదీన ఆ రాష్ట్రంలో సెలవు ఉంటుంది. సిక్కింలో నూతన సంవత్సరం సందర్భంగా ఇరవయ్యో తేదీన, అలాగే వేడుకల కొనసాగింపుగా ఇరవై రెండో తేదీన కూడా బ్యాంకులకు విరామం ఉంటుంది.
క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో డిసెంబరు పంతొమ్మిది నుంచి నెలాఖరు వరకు పలు ప్రాంతాల్లో సెలవుల పరంపర కొనసాగనుంది. ఇరవై నాల్గో తేదీన మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో క్రిస్మస్ ఈవ్ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ పండుగ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివుంటాయి. ఇరవై ఏడో తేదీ నాల్గవ శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా సెలవు కాగా, అదే రోజు నాగాలాండ్‌లో క్రిస్మస్ వేడుకల కారణంగా కూడా విరామం ఉంటుంది. ముప్పయ్యో తేదీన మేఘాలయలో జైన్‌తీయ స్వాతంత్ర్య సమరయోధుడు కియాంగ్ నంగ్బా వర్ధంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఇవి కాకుండా ఏడో, పద్నాలుగో, ఇరవై ఒకటో, ఇరవై ఎనిమిదో తేదీలు ఆదివారాలు కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు. మొత్తం లెక్కన డిసెంబరు నెలలో 16 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.
అయితే సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయి. కానీ ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే శాఖ స్థాయిలో పరిష్కారం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఖాతాదారులు అవసరమైన లావాదేవీలు ముందుగానే పూర్తి చేసుకుని, చివరి రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని బ్యాంకు వర్గాలు సూచిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.