నల్గొండలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభం
మహిళా గౌరవం, శక్తివంతత కోసం కీలక కార్యక్రమం
ఉదయాదిత్య భవన్‌లో చీరలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మహిళలకు చీరలను స్వయంగా అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం విస్తృత గుర్తింపు పొందుతోంది. తెలంగాణలో మొత్తం 1 కోటి 15 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ శనివారం నుంచి భారీ స్థాయిలో పంపిణీ ప్రారంభించిందని మంత్రి వివరించారు. ప్రతి మహిళకు గౌరవం, ఆత్మవిశ్వాసం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమం మహిళల శక్తివంతత, సామాజిక స్థాయి పెరుగుదల దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, స్వయం సహాయక బృందాల సభ్యులు, గృహిణులకు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రయోజనాలు అందిస్తుందని ఆయన తెలిపారు.
మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అనే దృష్టితో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్టు సూచించారు.

