📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణమియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ అక్రమ కబ్జాలపై కఠిన చర్యలు

మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ అక్రమ కబ్జాలపై కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

– మూడు వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి పరిరక్షణ
– సర్వే నంబరు 44లో 15 ఎకరాలకు పైగా భూమి స్వాధీనం
– అక్రమ కబ్జాలపై కఠిన చర్యలు

మియాపూర్//రంగారెడ్డి జిల్లా, జనవరి 10 (మనప్రజాప్రతినిధి):


రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలో హైడ్రా విభాగం భారీ ఆపరేషన్ నిర్వహించింది. సర్వే నంబరు 44లో అక్రమ ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, సుమారు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని కాపాడింది. ప్రజావాణికి గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇదే సర్వే నంబరులో ఇప్పటికే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గతంలోనే స్వాధీనం చేసుకుంది. మియాపూర్–బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై సుమారు రెండువందల మీటర్ల మేర ఏర్పాటు చేసిన పద్దెనిమిది షెడ్లను కూడా అప్పుడే తొలగించింది. తాజా విచారణలో సర్వే నంబరు 44లో పదిహేను ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాలో ఉన్నట్లు హైడ్రా నిర్ధారించింది.
ఇటీవల ప్రభుత్వ భూములకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లు, సంబంధిత ఉప రిజిస్ట్రార్‌పై చర్యల నేపథ్యంలో హైడ్రా మరోసారి విస్తృత స్థాయి విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో అక్కడి నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుర్తించింది. సర్వే నంబరు 159కు సంబంధించిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబరు 44లో ఎకరన్నర వరకూ ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని స్పష్టంగా తెలియజేస్తూ హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.