•సిపిఎం ఫిర్యాదుతో వెలుగులోకి ప్రభుత్వభూముల ఆక్రమణలు… 6ఎకరాల దందాపై సర్వే
•అమ్మచెరువు పరిధిలో అక్రమాల గుట్టు విప్పిన సర్వే…ధ్వంసమైన సర్వే రాళ్లు
•నోటీసులకూ లెక్కచేయని భూకబ్జాదారులు…రాజకీయ పలుకుబడితో రెచ్చిపోతున్న అక్రమాలు
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి23
సిపిఎం ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి మండలం అమ్మ చెరువు రెవెన్యూ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం గురువారం సర్వే నిర్వహించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు జిల్లా కలెక్టర్కు చేసిన ఫిర్యాదు ఆధారంగా వీఆర్వో లోకేష్, వీఆర్ఏలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.ఈ సర్వేలో సర్వే నంబర్లు 9,10,11పరిధిలో సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించబడి ఉండటాన్ని అధికారులు ప్రత్యక్షంగా గుర్తించారు. గ్రామస్తులు కాని వ్యక్తులు ఈ భూములను యథేచ్చగా అనుభవిస్తున్నట్లు నమోదు చేశారు. గతంలో ప్రభుత్వం సర్వే చేసి నాటిన రాళ్లను ధ్వంసం చేసి పక్కన పడేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.అత్యధిక భూముల ఆక్రమణకు వెంకటగిరికి చెందిన బలస రమేష్ కారణమని స్థానికులు వీఆర్వో దృష్టికి తీసుకువచ్చారు. అతడు చెరువు భూములను కూడా ఆక్రమించి కంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ అవి లెక్కచేయకుండా ఆక్రమణకొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదులను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ,“రెవెన్యూ యంత్రాంగం ఏ ప్రలోభాలకు లోనవుతోందో అర్థం కావడం లేదు. భూములు లేని పేదలు పని లేక కూలీ జీవితం కోసం అల్లాడుతుంటే, అక్రమ భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవడం లేదు” అని తీవ్ర విమర్శలు చేశారు.ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోకపోతే అన్ని రాజకీయ పార్టీలను, పేదలను ఏకం చేసి భూ పంపక ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెంచలయ్య, నాగభూషణం, వీఆర్ఏ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

