📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజనశక్తి పేరుతో దందాలు...మరో నిందితుడి అరెస్ట్ - కంట్రీమేడ్ పిస్టల్ స్వాధీనం.

జనశక్తి పేరుతో దందాలు…మరో నిందితుడి అరెస్ట్ – కంట్రీమేడ్ పిస్టల్ స్వాధీనం.

📰 Generate e-Paper Clip

వ్యాపారులు, రియల్ ఎస్టేట్ యజమానులను బెదిరించి వసూళ్లు – కంట్రీమేడ్ పిస్టల్, తూటాల స్వాధీనం
•నక్సలైట్ల ముసుగులో అక్రమ వసూళ్లు – పరారీలో ఉన్న నిందితుడు పట్టుబడ్డాడు

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.జనవరి21
జనశక్తి నక్సలైట్ల పేరుతో వ్యాపారులు, రియల్ ఎస్టేట్ యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలోని మరో సభ్యుడిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒక కంట్రీమేడ్ పిస్టల్, అదనపు మ్యాగజైన్‌తో పాటు 8 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
ఇదివరకే ఈ ముఠాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, వంజరి సురేందర్, పయ్యావుల గోవర్ధన్ అనే నలుగురు నిందితులను ఈ నెల 7న పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన సుధాపల్లి సుధాకర్, ముస్తాబాద్‌కు చెందిన బోయిని దేవరాజు, నల్గొండ జిల్లాకు చెందిన దుబ్బ మధు కలిసి పాత నిందితులతో చేతులు కలిపినట్లు పోలీసులు గుర్తించారు. భూవివాదాలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుని జనశక్తి పేరుతో తుపాకులు చూపించి బెదిరింపులకు పాల్పడి భారీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు పథకం వేశారు.
ఈ నెల 9న సుధాపల్లి సుధాకర్, బోయిని దేవరాజులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న దుబ్బ మధును బుధవారం ఉదయం ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లిలో పట్టుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఆయుధాలు కలిగి ఉన్నా, నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
ఈ ఆపరేషన్‌లో డీఎస్పీతో పాటు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్‌ఐ ఉపేంద్రచారి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.