📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె మేఘాలు

ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె మేఘాలు

📰 Generate e-Paper Clip

-అద్దె బస్సుల యజమానుల సమ్మె హెచ్చరిక
– ఈ నెల 12 నుంచి బస్సులు నిలిపివేతకు సంకేతాలు

అమరావతి, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మె సైరన్ మోగించారు. తమకు చెల్లిస్తున్న అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులను నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందని అద్దె బస్సుల యజమానులు పేర్కొంటున్నారు. అధిక రద్దీ కారణంగా బస్సుల నిర్వహణపై అదనపు భారం పడుతోందని, సిబ్బంది, మరమ్మతులు, టైర్లు వంటి ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత అద్దె సరిపోవడం లేదని వారు వాపోతున్నారు.
ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో భారీ నష్టాలు ఎదురవుతున్నాయని యజమానుల సంఘాలు వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపినా స్పష్టమైన పరిష్కారం లభించలేదని తెలిపాయి. యాజమాన్యం నెలకు అదనంగా రూ.5,200 పెంచేందుకు ముందుకు వచ్చినప్పటికీ, ఈ పెంపు చాలా స్వల్పమని యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమ సమస్యలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుని అద్దెను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్లు అద్దె బస్సుల యజమానుల సంఘాలు స్పష్టం చేశాయి. చర్చలకు ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యం ముందుకు రాకపోతే 12వ తేదీ నుంచి అద్దె బస్సుల సేవలు నిలిచిపోతాయని హెచ్చరించాయి. ఈ పరిణామం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.