– కేతిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు స్పందన
– బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్
తాడిపత్రి, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):
రాయలసీమ ప్రజల పౌరుషంపై మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, తనకు పౌరుషం ఉందని స్పష్టం చేసిన జేసీ, కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజల ఉప్పు తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ, గుడ్ మార్నింగ్ షోలు చేయడం తప్ప ప్రజలకు ఏమి చేశారని ఎద్దేవా చేశారు.
మూడేళ్ల తర్వాత చూస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించిన జేసీ, దమ్ముంటే ఇప్పుడే రావాలని సవాల్ విసిరారు. కేతిరెడ్డి వద్ద ఉన్న కార్లు, గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టులపై వైసీపీ రాజకీయాలు చేస్తే రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టే ఇప్పటివరకు ఓపిక పట్టామని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అభివృద్ధి కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే, వైసీపీ నేతలు రప్పా రప్పా అంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి రాయలసీమ పేరు తీస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తూ, రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఏం చేశారు, జగన్ ఏం చేశారో ప్రజల ముందే తేల్చుకుందామని పేర్కొన్నారు. అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
రాయలసీమ పౌరుషంపై వ్యాఖ్యలు రాజుకున్న రాజకీయ దుమారం
RELATED ARTICLES

