📄 ePaper
Saturday, July 4, 2026
Homeతెలంగాణప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు

ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు

📰 Generate e-Paper Clip

శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్
– జీవిత ఖైదు శిక్షపై అప్పీల్ పెండింగ్

హైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):
తెలంగాణను కుదిపేసిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో 2025 మార్చిలో నల్గొండ జిల్లా కోర్టు శ్రవణ్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అప్పీల్ విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం, నిందితుడి వయసు, జైలు జీవితం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్‌కు అనుమతినిచ్చింది.
2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ను ఆయన మామ మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో దారుణంగా హత్య చేయించారు. తన కుమార్తె అమృత, ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకోవడమే ఈ ఘాతుకానికి కారణమైంది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించి, పరువు హత్యలపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన నల్గొండ కోర్టు, ప్రణయ్‌ను హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించింది. అమృత బాబాయి అయిన శ్రవణ్‌కుమార్‌తో పాటు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా ఖరారు చేసింది. తాజాగా శ్రవణ్‌కు బెయిల్ మంజూరవడం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular