📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅక్రిడిటేషన్ల సవరణ జీవోపై టీయూడబ్ల్యూజే హర్షం..

అక్రిడిటేషన్ల సవరణ జీవోపై టీయూడబ్ల్యూజే హర్షం..

📰 Generate e-Paper Clip

•నియోజకవర్గ స్థాయి,కేబుల్ ఛానల్ రిపోర్టర్లకూ న్యాయం చేయాలి :జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి26
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో నెంబర్–103పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ.. గతంలో విడుదల చేసిన జీవో నెంబర్–252పై టీయూడబ్ల్యూజే చేపట్టిన ఉద్యమాల ఫలితంగా జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం అభినందనీయ మన్నారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో సవరణ జీవో తీసుకురావడం, అందులో డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇతర జర్నలిస్టుల మాదిరిగానే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేయడం సానుకూల నిర్ణయమన్నారు.మండల స్థాయిలో లక్షన్నరకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో అదనపు కార్డులు ఇవ్వడం, అలాగే కల్చరల్, స్పోర్ట్స్, సినిమా జర్నలిస్టులకు ప్రత్యేక అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవోలో వచ్చిన ఈ మార్పులు టీయూడబ్ల్యూజే సాధించిన విజయంగా పేర్కొన్నారు.అయితే గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్–239 ప్రకారం జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యకు, ప్రస్తుత సవరణ జీవో తర్వాత ఇచ్చే కార్డుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి, జీవో–239 ప్రకారం జారీ చేసిన కార్డుల సంఖ్యనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.కేబుల్ ఛానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు మరోసారి మొండిచెయ్యి-గతంలో రాష్ట్రస్థాయిలో కేబుల్ ఛానల్స్‌కు ఐ అండ్ పీఆర్ ద్వారా ఒక్కో ఛానల్‌కు 12 అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందేనని లాయక్ పాషా గుర్తు చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే మంత్రి దృష్టికి తీసుకెళ్లినా, తాజా సవరణ జీవోలో కేబుల్ ఛానల్స్‌కు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.అదేవిధంగా నియోజక వర్గ స్థాయిలో పనిచేస్తున్న రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డులవిషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని విమర్శించారు. యూనియన్‌గా తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసినప్పటికీ ఈ రెండు అంశాలను పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు.
ఈ విషయమై సమాచార శాఖ స్పెషల్ కమిషనర్‌ను త్వరలోనే కలిసి మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కేబుల్ ఛానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే మరోసారి ఉద్యమ బాట తప్పదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.