•ఎంపికైన లబ్ధిదారులకు సహాయ పరికరాల తక్షణ పంపిణీ చేయాలి
మెదక్ జిల్లా,ఫిబ్రవరి25(మనప్రజాప్రతినిధి):
వికలాంగుల పెన్షన్‌ను రూ.6000లకు పెంచాలని, ఎంపికైన లబ్ధిదారులకు సహాయ పరికరాలు వెంటనే పంపిణీ చేయాలని (వికలాంగులహక్కులజాతీయవేదిక(ఎన్‌పీఆర్‌డీ)) జిల్లా కార్యదర్శి యశోద డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తయ్యిందని, పెన్షన్ పెంపు కోసం సుమారు 42 లక్షల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పెన్షన్ పెంపుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.2023 డిసెంబర్ నెల నుండి కొత్త పెన్షన్ల కోసం 24.85 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నా, ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదని విమర్శించారు. చేయూత పెన్షన్ దరఖాస్తులను వెంటనే ఆమోదించా లని కోరారు.సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల ఎంపిక జరిగి సంవత్సరం గడిచినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపికైన ప్రతి వికలాంగుడికి తక్షణమే పరికరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గారంటీ యాక్ట్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం – 2005) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వి.బి.గ్రామ్‌జీ 2025 చట్టం వల్ల నరేగా పనుల్లో ఉన్న వికలాంగుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. నరేగా చట్టాన్ని యథావిధిగా కొనసాగించి, ప్రతి గ్రామంలోని వికలాంగులకు జాబ్ కార్డులు జారీ చేసి ఉపాధి కల్పించాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెంచాలని, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.34ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా, నాయకులు కవిత, వెంకట్, చంద్రమ్మ, కేశమ్మ, సాయిలు, ఓం సాయి, కిష్టయ్య, చంద్రం, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

