📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణసమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఆయుధమా? లేక కొందరి చేతుల్లో వ్యాపార సాధనమా?

సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఆయుధమా? లేక కొందరి చేతుల్లో వ్యాపార సాధనమా?

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట, జూన్ 13:
ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం 2005లో తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం
(రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ -RTI) దేశ చరిత్రలో ఒక మైలురాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఈ చట్టం సామాన్య పౌరుడికి రాజ్యాంగబద్ధమైన అస్త్రంగా మారింది.
ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కినా సమాచారం దొరకని పరిస్థితి ఉండేది. కానీ ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అటెండర్ నుండి కలెక్టర్ వరకు, గ్రామ పంచాయతీ నుండి సచివాలయం వరకు ప్రజా సమాచారాన్ని అడిగే హక్కు ప్రతి పౌరుడికి లభించింది. ఫలితంగా వేలాది అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాధనం దుర్వినియోగం, నకిలీ బిల్లులు, అక్రమ నియామకాలు, భూ కబ్జాలు, సంక్షేమ పథకాలలో జరిగిన అవకతవకలు ప్రజలకు తెలిసే అవకాశం ఏర్పడింది.
అయితే, కాలక్రమేణా ఈ చట్టం అసలు లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఈ చట్టం కొందరి చేతుల్లో వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ కక్షసాధింపులు, ఒత్తిళ్ల సాధనంగా మారుతోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
కొన్ని సంఘాలు, కొందరు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు, విద్యార్థి సంఘాల నాయకులుగా చలామణి అవుతున్న కొందరు వ్యక్తులు ఆర్టీఐ చట్టాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న లోపాలు, అక్రమాలపై సమాచారం సేకరించడం వరకు సరైనదే అయినప్పటికీ, ఆ సమాచారాన్ని పొందిన తర్వాత తప్పు చేసిన అధికారులతో రాజీ పడటం, పరస్పర ప్రయోజనాల కోసం కుమ్మక్కవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పౌర సమాజ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సమాచారం సేకరించిన తర్వాత దానిని ప్రజల ముందుకు తీసుకురాకుండా, సంబంధిత అధికారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని మౌనంగా ఉండిపోవడం వల్ల అవినీతి నిర్మూలన లక్ష్యం దెబ్బతింటోంది. చట్టాన్ని ఉపయోగించి అవినీతిని బయటపెట్టాల్సిన వారు, అదే అవినీతిలో భాగస్వాములవుతున్న పరిస్థితులు సమాజంలో ప్రమాదకర సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
రాజకీయ రంగంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీ చేసిన అక్రమాలపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు చేసిన అవినీతిపై అధికార పార్టీలు ఆర్టీఐ సమాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నప్పటికీ, చివరకు ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా మారుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల ముందు పోరాటం చేస్తున్నట్లు కనిపించినా, తెరవెనుక చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని వ్యవహారాలను మసకబార్చే ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.ఇలాంటి పరిస్థితులను చూస్తే “అందరూ శాకాహారులే… రొయ్యల ముళ్లు ఎవరు యాడబోయారు?” అనే సామెత గుర్తుకు వస్తుంది. అవినీతి వ్యతిరేక పోరాటం పేరిట ప్రారంభమైన అనేక అంశాలు చివరకు వ్యక్తిగత ప్రయోజనాల వద్దే ముగిసిపోతున్నాయనే భావన ప్రజల్లో పెరుగుతోంది.
అయితే దీనర్థం ఆర్టీఐ చట్టం విఫలమైందని కాదు. దేశంలో ఇప్పటికీ వేలాది మంది నిజాయితీ గల పౌరులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు ఈ చట్టాన్ని సమాజ ప్రయోజనాల కోసం సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. వారి కృషి వల్లనే అనేక అవినీతి కేసులు వెలుగులోకి వచ్చి ప్రభుత్వాలకు, అధికారులకు జవాబుదారీతనం పెరిగింది.
అందుకే ప్రస్తుతం అవసరమైంది చట్టాన్ని బలహీనపరచడం కాదు; చట్టంలోని లొసుగులను సరిదిద్దడం. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకునే విధానాన్ని మరింత పటిష్టం చేయాలి. సమాచారాన్ని పొందిన తర్వాత దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలించాలి. అలాగే సమాచారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే వారిని ప్రోత్సహించాలి.సమాచార హక్కు చట్టం కేవలం ఒక చట్టం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కవచం. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకున్న పర్యవేక్షణ హక్కుకు ఇది ప్రతీక. ఈ ఆయుధం బలహీనపడితే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది.కాబట్టి నిజమైన సమాజ శ్రేయస్సు కోరే పౌర సమాజం, సామాజిక సంఘాలు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వ్యక్తిగత లాభాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీఐని వినియోగించాలి. రాజ్యాంగం సామాన్యుడికి అందించిన ఈ శక్తివంతమైన ఆయుధాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత.సమాచార హక్కు చట్టం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఆర్టీఐని కాపాడటం అంటే ప్రజల హక్కులను, ప్రజాధనాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే.


                    వ్యాసకర్త :

                 దేవులపల్లి భూపతి,
                  ఎం.ఏ,  ఎం.ఫిల్, డి.ఎడ్,
                 ( జర్నలిస్ట్),వాగ్గేయకారుడు .
            C. No  9642228313

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.