బీసీల జనాభాకు ఖచ్చితమైన లెక్కలు అవసరం
సామాజిక న్యాయానికి కులగణన కీలకం
జనాభా ప్రాతిపదికనే హక్కులు, రిజర్వేషన్లు
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): దేశంలో బీసీల జనాభా భారీగా ఉన్నప్పటికీ వారి కులాల వారీగా ఖచ్చితమైన జనాభా లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనగణనలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్, తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు, మాజీ డీజీపీ పూర్ణచందర్ రావు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే చట్టబద్ధమైన జనాభా లెక్కలు లేవంటూ పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మరోవైపు కులగణన చేపడతామని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నప్పటికీ అమలులో మాత్రం జాప్యం జరుగుతోందని విమర్శించారు. బ్రిటిష్ పాలన కాలంలో 1881 నుంచి 1931 వరకు నిర్వహించిన జనగణనల్లో కులాల వివరాలు సేకరించారని, అప్పట్లో వేలాది బీసీ కులాలు గుర్తించబడినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా బీసీల కులాల వారీ గణనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అన్నారు.
ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా కులాల వారీగా, కుటుంబాల వారీగా జనాభా లెక్కలు పారదర్శకంగా సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఒకే కులానికి వేర్వేరు పేర్లు ఉండే పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ విధానంలో కులగణన నిర్వహించాలని సూచించారు. బీసీల కులగణన విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు హక్కులు, రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుకు వచ్చే పార్టీలకే బీసీల మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో జంతువుల సంఖ్యకు కూడా లెక్కలు ఉన్నప్పటికీ బీసీల జనాభాపై ఖచ్చితమైన గణాంకాలు లేకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
బీసీ కులగణనకు అన్ని పార్టీలు ముందుకు రావాలి
RELATED ARTICLES



