📄 ePaper
Friday, August 21, 2026
Homeఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం

📰 Generate e-Paper Clip

బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం
ప్రత్యక్ష పద్ధతిలో పట్టణ ఎన్నికలు
55కు పైగా అంశాలపై చర్చ
కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
అమరావతి,ఆగస్టు19(మనప్రజాప్రతినిధి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పాలన, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజాప్రతినిధ్య వ్యవస్థలో మార్పులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించిన మంత్రివర్గం అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50 శాతం, ఇతర స్థానిక సంస్థల్లో 33.50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది. సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం పెంపుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నివేదికపై కూడా మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. కమిషన్ సూచనల ప్రకారం 34 శాతం రిజర్వేషన్ల లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కొన్ని సాంకేతిక, చట్టపరమైన సవాళ్లు ఉన్నట్లు సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. మరో కీలక నిర్ణయంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్‌పర్సన్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రజలకు నేరుగా నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించడం ద్వారా స్థానిక పాలన మరింత జవాబుదారీతనంతో ముందుకు సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన దాదాపు 55కు పైగా అజెండా అంశాలను పరిశీలించారు. వివిధ శాఖల ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు పెంచడం, ప్రజలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లు, ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలుతో స్థానిక సంస్థల రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.