📄 ePaper
Friday, August 21, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుభూలక్ష్మి పథకంతో పేదలకు భూమి

భూలక్ష్మి పథకంతో పేదలకు భూమి

📰 Generate e-Paper Clip

సామాజిక న్యాయంపై కవిత విమర్శలు
భూ పంపిణీ మళ్లీ చేపట్టాలని డిమాండ్
ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్,ఆగస్టు18(మనప్రజాప్రతినిధి): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించాలంటే మరోసారి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే “భూలక్ష్మి” పథకం ద్వారా భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. భూమి అనేది పేదలకు ఆస్తి మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం పేరుతో మాట్లాడుతున్నప్పటికీ ఆచరణలో సామాజిక అన్యాయం జరుగుతోందని కవిత ఆరోపించారు. తమ పార్టీ నిర్వహించిన సామాజిక న్యాయ సంకల్ప సభ తర్వాతే ప్రభుత్వం ఈ అంశంపై మాట్లాడడం ప్రారంభించిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు.
భూ విధానాలపై కూడా కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశ్రమల పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, పేదల భూముల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూముల వినియోగంపై పారదర్శకత లేదని, భూములకు సంబంధించిన విధానాలు పేదలకు నష్టం కలిగించేలా మారుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న భూమి వనరులను సమర్థంగా వినియోగిస్తే భూమిలేని కుటుంబాలకు భూమి పంపిణీ చేయడం సాధ్యమేనని కవిత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, ఇతర అందుబాటులో ఉన్న భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. భూమి పంపిణీ ద్వారా గ్రామీణ పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సామాజిక సమానత్వం కూడా బలోపేతం అవుతుందని తెలిపారు.
బీసీలు, మైనార్టీలు, మహిళలు, ఆదివాసీలు, దళితులకు తగిన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆస్తుల పంపిణీ ద్వారా కూడా సామాజిక న్యాయం సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూమి ఉన్న కుటుంబాలకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుందని, అదే అవకాశాన్ని పేదలకు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకాన్ని అమలు చేసి ప్రతి భూమిలేని పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి అందిస్తామని కవిత పునరుద్ఘాటించారు. సామాజిక న్యాయం కోసం ప్రజలు, మేధావులు, సామాజిక సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పేదల భూముల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, భూమి పంపిణీ ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.