📄 ePaper
Thursday, August 20, 2026
Homeఎడిటోరియల్ఆచూకీ లేని మత్స్యకారులపై ఆందోళన

ఆచూకీ లేని మత్స్యకారులపై ఆందోళన

📰 Generate e-Paper Clip

ఎనిమిది మంది కోసం గాలింపు
కోస్ట్‌గార్డ్‌తో ముమ్మర చర్యలు
కుటుంబాల్లో పెరుగుతున్న ఉత్కంఠ

కోనసీమ, ఆగస్టు 17 (మనప్రజాప్రతినిధి):

చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కోనసీమ జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన ఒక బోటులో ఈ నెల 3న మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లగా, నిర్ణీత గడువు ముగిసినా వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడం కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు, మత్స్యకార సంఘాలు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మత్స్యకారులు సాధారణ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ప్రణాళిక ప్రకారం ఈ నెల 13వ తేదీ నాటికి తిరిగి ఒడ్డుకు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారి బోటు గానీ, వారి ఆచూకీ గానీ లభించలేదు. దీంతో జిల్లా యంత్రాంగం పరిస్థితిని అత్యంత సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.
మత్స్యకారుల వద్ద సుమారు 15 రోజుల పాటు సరిపడే ఆహార నిల్వలు, వెయ్యి లీటర్ల డీజిల్ మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడువు దాటిపోవడంతో పాటు వారితో ఫోన్ ద్వారా కూడా సంబంధాలు తెగిపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బోటులో సాంకేతిక సమస్య తలెత్తిందా లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉందా అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. బోటు విశాఖపట్నం తీర ప్రాంతాన్ని దాటి ఒడిశాలోని పారాదీప్ వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర పరిస్థితులు మారి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్ర మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బోటు కదలికలపై సమాచారం సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఇండియన్ కోస్ట్‌గార్డ్ అధికారులతో సమన్వయం చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బోటు యజమాని నుంచి పూర్తి వివరాలు సేకరించి, మత్స్యకారుల పేర్లు, కుటుంబాల వివరాలు, బోటు ప్రయాణానికి సంబంధించిన సమాచారం కోస్ట్‌గార్డ్ అధికారులకు అందజేశారు. సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో తమ వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని, మత్స్యకారుల ఆచూకీ త్వరలో లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం అందినా వెంటనే వెల్లడిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.