📄 ePaper
Thursday, August 20, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రిన్సిపల్ హత్య కేసు ఛేదన

ప్రిన్సిపల్ హత్య కేసు ఛేదన

📰 Generate e-Paper Clip

ఇద్దరు మైనర్ విద్యార్థులే నిందితులు
డబ్బు కోసం దారుణ హత్యకు పాల్పడినట్లు వెల్లడి
70 సీసీ కెమెరాల ఆధారంగా మిస్టరీ వీడింది
నల్గొండ,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి ఇద్దరు మైనర్ విద్యార్థులే పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడిన ఈ ఇద్దరు విద్యార్థులు డబ్బు కోసం చోరీకి ప్రయత్నించి, పరిస్థితులు అనుకూలించకపోవడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న కొండమల్లేపల్లిలోని రూపారెడ్డి నివాసంలో చోరీ చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులు ముందస్తుగా పథకం రచించినట్లు తెలిపారు. వారిలో ఒకరు ముఖానికి మాస్క్ ధరించి ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించాడని చెప్పారు. అయితే మాస్క్ జారిపోవడంతో రూపారెడ్డి అతడిని గుర్తుపట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందన్నారు.
తాను పట్టుబడతాననే భయంతో నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో రూపారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ వివరించారు. ఆమెపై ఏకంగా 27 సార్లు కత్తిపోట్లు పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడని తెలిపారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు తీసుకోవడంతో పాటు ఆమె సెల్‌ఫోన్‌ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. కేసు చేధన కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత దర్యాప్తు చేపట్టారు. సంఘటన ప్రాంతం పరిసరాల్లోని సుమారు 70 సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా గైర్హాజరవడంతో పాటు అకస్మాత్తుగా అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై దృష్టి సారించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. గతంలో హాస్టల్‌లో ఉండగా నిందితుడి వద్ద నగదు, సెల్‌ఫోన్ లభించడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి అతడిని మందలించారని తెలిపారు. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్న విద్యార్థి, డబ్బు అవసరం కూడా ఉండటంతో ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. హత్య వెనుక వ్యక్తిగత కక్షతో పాటు ఆర్థిక ప్రయోజనం కూడా ప్రధాన కారణాలుగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి రూ.1.54 లక్షల నగదు, ఒక ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్లపై ఉన్న రక్తపు మరకలను శాస్త్రీయ పరీక్షలకు పంపగా అవి మనిషి రక్తమేనని నిర్ధారణ అయినట్లు తెలిపారు. నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరచనున్నట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.