📄 ePaper
Thursday, August 20, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకల్తీ నెయ్యిపై సజ్జనార్ హెచ్చరిక

కల్తీ నెయ్యిపై సజ్జనార్ హెచ్చరిక

📰 Generate e-Paper Clip

ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దు
భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాద్,ఆగస్టు19(మనప్రజాప్రతినిధి): ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే కల్తీ ఆహార వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) చేపట్టిన భారీ దాడులను ప్రస్తావిస్తూ ఆయన   స్పందించారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 130 సంస్థలను పరిశీలించగా, 39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ సువాసన పదార్థాలతో తయారు చేసిన నెయ్యిని స్వచ్ఛమైన నెయ్యిగా విక్రయిస్తున్నట్లు బయటపడింది. ప్రజలను మోసం చేస్తూ అధిక లాభాల కోసం ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
దాడుల్లో సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో టన్నుల కొద్దీ కల్తీ నెయ్యితో పాటు క్రీమ్, పామ్ ఆయిల్, వనస్పతి, కృత్రిమ సువాసన పదార్థాలు ఉన్నాయి. సేకరించిన నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపించగా, తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆహార భద్రత అధికారులకు అప్పగించారు. ఈ చర్యలు ఆహార భద్రత పరిరక్షణలో కీలక ముందడుగుగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా హోటళ్లు, టిఫిన్ కేంద్రాలు, మిఠాయి తయారీ సంస్థలు, బేకరీలు, క్యాటరింగ్ సంస్థలు, డెయిరీ దుకాణాలు, ఆయుర్వేద కేంద్రాల వరకు విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. కొందరు పూజలు, దీపారాధన కోసం వినియోగించే నెయ్యిగా కూడా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు బయటపడింది. తక్కువ ఖర్చుతో తయారు చేసి అధిక ధరలకు విక్రయించడం ద్వారా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల వినియోగం గుండె, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు, తయారీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆహార కల్తీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. కల్తీ వ్యాపారాలపై సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాజ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారిపై చట్టం తన పని తాను చేస్తుందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.