📄 ePaper
Thursday, August 20, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై సమీక్ష

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై సమీక్ష

📰 Generate e-Paper Clip

కేశవరావు అధ్యక్షతన కమిటీ సమావేశం
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై చర్చ
వివిధ వర్గాల సూచనల పరిశీలన
త్వరలో ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 18 (మనప్రజాప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. కమిటీ చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ వర్గాల ఉద్యమకారుల గుర్తింపుకు అనుసరించాల్సిన విధానాలపై విస్తృతంగా చర్చించారు. ఉద్యమ స్వరూపం, వివిధ దశల్లో ప్రజల భాగస్వామ్యం, ఉద్యమకారుల పాత్ర, గుర్తింపునకు అవసరమైన ప్రమాణాలు వంటి అంశాలను సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. ఉద్యమ చరిత్రకు న్యాయం చేసేలా పారదర్శక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
ఇప్పటికే కమిటీ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజాసంఘాలు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి అనుభవాలు, అభిప్రాయాలు, సూచనలను సేకరించి వాటిని విశ్లేషించే ప్రక్రియ చేపట్టింది. ఉద్యమకారుల గుర్తింపు విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సమగ్ర ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరాన్ని కమిటీ సభ్యులు నొక్కి చెప్పారు. ఉద్యమంలో ప్రత్యక్ష, పరోక్షంగా సేవలందించిన ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అందిన సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికలో పొందుపరచాలని నిర్ణయించారు.
సమావేశంలో స్వీకరించిన సూచనలు, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అంశాలు, కమిటీ చేసిన పరిశీలనలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఆ నివేదికను త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో కమిటీ ప్రత్యేకంగా సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారుల సేవలను అధికారికంగా గుర్తించి గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కమిటీ పేర్కొంది. ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించేలా, నిజమైన ఉద్యమకారులకు సముచిత గుర్తింపు కల్పించేలా పారదర్శకమైన ప్రక్రియను అమలు చేయడంలో కమిటీ కట్టుబడి ఉందని సభ్యులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.