📄 ePaper
Friday, August 21, 2026
Homeతెలంగాణరోడ్డెక్కిన పశువులు నిర్లక్ష్యానికి నిదర్శనం

రోడ్డెక్కిన పశువులు నిర్లక్ష్యానికి నిదర్శనం

📰 Generate e-Paper Clip

-పశువుల నియంత్రణపై పట్టింపు కరవు
-కనుమరుగైన బందెల దొడ్లు
-రహదారులపై పెరుగుతున్న పశువుల సంచారం
-అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
-మున్సిపల్ పాలకవర్గంపై ఆశలు చర్యలు మాత్రం శూన్యం

మనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్, ఆగష్టు16*
హుజూర్‌నగర్ మెయిన్ రోడ్లపై పశువుల సంచారం మాత్రం తగ్గడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో యజమానులు పశువులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో పశువులు గుంపులుగా తిరుగుతూ రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో రహదారులపై పశువులు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పశువుల కారణంగా పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బందెల దొడ్లు ఏమయ్యాయి?
గతంలో గ్రామాల్లో పశువులను అదుపులో ఉంచేందుకు బందెల దొడ్లు ఉండేవి. పశువులను రోడ్లపైకి వదిలేస్తే వాటిని అక్కడికి తరలించి యజమానులకు జరిమానాలు విధించే విధానం ఉండేది. కాలక్రమంలో ఆ వ్యవస్థ కనుమరుగవడంతో పశువుల యజమానులు వాటిని స్వేచ్ఛగా రోడ్లపైకి వదిలేస్తున్నారు. దీంతో పశువుల సంరక్షణ బాధ్యత ప్రజలపై, వాటి నియంత్రణ బాధ్యత అధికారులపై ప్రశ్నార్థకంగా మారింది.
నిబంధనలు ఉన్నా అమలు ఎక్కడ?
పశువులను రోడ్లపై వదిలేయకుండా యజమానులను నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉంది. అవసరమైతే పశువులను పట్టుకుని సంరక్షణ కేంద్రాలకు తరలించడం, యజమానులపై జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి చర్యలు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ పాలకవర్గంపై ఆశలు
పట్టణంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు మున్సిపల్ పాలకవర్గాన్ని కోరుతున్నారు. పశువుల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన చోట బందెల దొడ్లను ఏర్పాటు చేసి పశువులను రోడ్లపైకి వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యపై అధికారులు ఇప్పటికైనా మేల్కొని చర్యలు తీసుకుంటారా? లేక రోడ్లపై పశువుల సంచారం ఇలాగే కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.