•నేటినుంచి ఇంటర్ ప్రీ–ఫైనల్ పరీక్షలు
•జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట జిల్లా.జనవరి3
పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇంటర్మీడియట్ విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా సీరియస్‌గా చదువుపై దృష్టి సారించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం నుంచి జిల్లాలో ప్రీ–ఫైనల్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులంతా తప్పనిసరిగా పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియే షన్ నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, పలు విద్యా సంబంధిత సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో దాదాపుగా సిలబస్ పూర్తి చేశామని, ఇప్పటికే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి మార్కులు నమోదు చేసినట్టు తెలిపారు.పరీక్షల షెడ్యూల్ వివరాలు:ఈనెల 21న ఫస్ట్ ఇయర్, 22న సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 23న బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుందని, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.24న పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని, ఈ పరీక్షకు హాజరు కాకపోతే వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయినట్లే అవుతుందని హెచ్చరించారు.ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు సైన్స్ విద్యార్థులకు రెండు విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలునిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడి యట్ థియరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి:విద్యార్థులు సమయం ఎంతో విలువైనదని గుర్తించి ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ముఖ్యమైన ప్రశ్నలు–జవాబులను మరలా వివరించి అందరూ తప్పనిసరిగా పాస్ అయ్యేలా చూడాలన్నారు.
ఈ సంవత్సరం జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనుక చంద్రం, రాష్ట్ర అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరిపల్లి నగేష్, ప్రచార కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

