📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణమేడారం మహా జాతరకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

మేడారం మహా జాతరకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

– కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు
– సంప్రదాయబద్ధంగా జాతర… రాజకీయాలకు అతీతంగా ఆహ్వానం

హైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):


ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. మేడారం జాతర ఆహ్వాన పత్రికతో పాటు తల్లుల బంగారం, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరిస్తూ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు తానే స్వయంగా మేడారం జాతర ఆహ్వానం అందజేశానని తెలిపారు. అయితే ఆ సమయంలో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం రాలేదని, అందుకే ప్రత్యేకంగా ఆయన నివాసానికి వచ్చి ఆహ్వానించామని వెల్లడించారు.
మేడారం జాతర సంప్రదాయబద్ధంగా, రాష్ట్ర పండుగగా ఎన్నో ఏళ్లుగా నిర్వహించుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీ బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మల జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మలని అన్నారు.
మేడారం మహా జాతరకు కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభమ్మను కూడా రావాల్సిందిగా ఆహ్వానించామని మంత్రి తెలిపారు. తల్లుల బంగారం, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించి ఆహ్వానం అందజేశామని, దీనిని వారు ఆత్మీయంగా స్వీకరించారని చెప్పారు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన తమకు ఆయన తరఫున చీరలు బహుకరించటం ఆనందంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడుకునే సందర్భం కాదని, ఇది పూర్తిగా ఒక ఆధ్యాత్మిక, సంప్రదాయ కార్యక్రమమని మంత్రి స్పష్టం చేశారు. ఆడబిడ్డలుగా తాము కేసీఆర్‌ను మేడారం జాతరకు ఆహ్వానించామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి జాతరకు వస్తానని చెప్పారని వెల్లడించారు.
ఈ భేటీలో మంత్రులతో పాటు ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆకాంక్ష రెడ్డి కూడా కేసీఆర్‌ను కలిసి మేడారం మహా జాతర ఆహ్వానాన్ని అందజేశారు. ఈ ఆహ్వానం రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.